తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం మీద దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. వాటర్ గ్రిడ్ పథకం అత్యంత ఆచరణీయంగా ఉందని కేంద్రం కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి ముందుకొచ్చింది. వాటర్ గ్రిడ్ పథకం వివరాలను తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి తమ రాష్ట్రానికి ఆహ్వానించారు. గురువారం లక్నో చేరుకున్న మంత్రి కేటీఆర్ బృందాన్ని అఖిలేష్ యాదవ్ సాదరంగా ఆహ్వానించారు.
వాటర్ గ్రిడ్ ఆలోచన, పథకం కార్యాచరణ, లక్ష్యాలు, ప్రయోజనాలను మంత్రి కేటీఆర్ బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. అన్ని విషయాలను తెలుసుకున్న అనంతరం అఖిలేష్ వాటర్ గ్రిడ్ పథకాన్ని అభినందించారు. సమావేశం తర్వాత యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తాగునీటి పథకం భారతదేశానికే ఆదర్శమని, కొత్త రాష్ట్రం అయినప్పటికీ కోట్లాదిమంది ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఈ పథకం చేపట్టడం అసామాన్యమని కొనియాడారు. తెలంగాణ స్ఫూర్తిగా ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ లో ఈ తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలో యూపీలోని కీలక ఇంజినీర్లందరినీ తనతో పాటు తీసుకొని తెలంగాణకు వస్తానని అఖిలేష్ చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకం డిజైన్ పై, పనుల పర్యవేక్షణపై తమ ఇంజినీర్లకు తెలంగాణ ఇంజినీర్లతో అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.
యువకుడైన మంత్రి కేటీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని, ఆయన ఆలోచనల్లో దార్శనికత, నిజాయితీ కనిపించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎన్నో మైలురాళ్ళు దాటుతుందనే విశ్వాసం తమకుందని అఖిలేష్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడం ఆనందంగా ఉందని, ఇతర రాష్ట్రాల్లో అమలౌతున్న మంచి పథకాలను అధ్యయనం చేయడం, తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలనుకోవడం అఖిలేష్ గొప్పతనం అని ప్రశంసించారు. త్వరలోనే అఖిలేష్ తెలంగాణలో పర్యటిస్తారని మంత్రి తెలిపారు. ఇదిలాఉండగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ములాయం మాట్లాడుతూ యువకుడైన మంత్రి కేటీఆర్ చొరవ, మాటతీరు, దేశ రాజకీయాలపై ఆయనకున్న అవగాహన ఎంతో గొప్పదని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ కీలకశక్తిగా ఎదగడం ఖాయం అని అన్నారు.