రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పథకంపై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు, అన్నిపార్టీల రాజకీయ నేతలు ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, పౌరసరఫరాల శాఖామంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఉమ్మడి రాష్ట్రంలో పురుగుల అన్నం-స్వరాష్ట్రంలో సన్నబియ్యం అని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు.
ఆదివారం హైదరాబాద్ లోని ఈటెల నివాసంలో పలువురు ఎస్టీ హాస్టల్ విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమంగా దారిమళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదుచేసి జైళ్లకు పంపుతామని హెచ్చరించారు. ఈ పథకం కోసం ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదని, ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమైన భావి పౌరులైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఆరోగ్యంగా ఉండాలంటే సన్నబియ్యంతో అన్నం పెట్టాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజేందర్ పేర్కొన్నారు.