తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి, పలువురు టీ ఎన్జీవో నేతలు మంగళవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి ఉద్యోగుల ఆప్షన్లపై చర్చించారు. తెలంగాణ ఉద్యోగుల డిమాండ్ల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని, ఆప్షన్లను అంగీకరించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇన్నాళ్ళుగా తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలన్నింటిపై టీఆర్ఎస్ కు స్పష్టమైన అవగాహన ఉందని, అన్ని అంశాలనూ పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు ఇవ్వకపోవడంపై ఏదో కుట్ర దాగిఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జోనల్, మల్టీ జోనల్ స్థానాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులందరినీ తెలంగాణలోనే కొనసాగించే కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్ కు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబడవని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేసేలా టీఆర్ఎస్ బాధ్యతగా వ్యవహరిస్తుందని కేసీఆర్ టీఎన్జీవో నేతలకు హామీ ఇచ్చారు.