అపాయింటెడ్ డే ను జూన్ రెండున కాకుండా మే 16న ప్రకటించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు జీ జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీని మే 16గా ప్రకటించాలన్న పిటిషనర్ అభ్యర్ధనపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు కోరింది. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ సత్యనారాయణ మూర్తిల ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అపాయింటెడ్ డేను మార్చే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని, ఆర్టికల్ 226 ప్రకారం కేంద్రానికి తాము ఆదేశాలు ఇవ్వలేమని, అందువల్ల మే 16న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉండేలా ప్రకటించాలని ఒక వినతిపత్రాన్ని కేంద్రానికి సమర్పించాలని జగదీశ్వర్ రెడ్డికి హైకోర్టు సూచించింది.
గతంలో జూన్ 2న అపాయింటెడ్ డే గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఏప్రిల్ 28నాడే శాసనసభ రద్దుచేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనుండటంతో, వెంటనే మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే అపాయింటెడ్ డే జూన్ 2న ఉంటే మధ్యలో 17 రోజుల వ్యవధి ఉంటుందని, ఈ మధ్య కాలంలో రాజకీయ సంక్షోభం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారినందున 294 మంది శాసనసభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలులేదని ఆయన వివరించారు.
అంతా విన్న ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ అభ్యర్థనలో సరైన కారణాలు కనిపిస్తున్నాయని, ఈ విషయంపై పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ నిర్ణీత గడువులోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయంపై తాము ఎలాంటి గడువు విధించడం లేదని పేర్కొంది.