ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఉద్యోగులకు రేపు హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, వైద్య ఖర్చులపై పరిమితులను పూర్తిగా ఎత్తేస్తామని తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, ఉద్యోగులు మరింత అంకితభావంతో పని చేయాలని, ప్రభుత్వం ఆదాయం పెంచేందుకు మరింత కృషి చేయాలని కోరారు. ఈ హెల్త్ కార్డులతో ఉద్యోగులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యసేవలు అందుకోనున్నారు.
హెల్త్ కార్డులు ఇచ్చినందుకు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పనిగంటలతో సంబంధం లేకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగసంఘాల నేతలు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.