గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కర్నె ప్రభాకర్ కు ఆత్మీయసర్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలను నమ్మి కష్టపడి పనిచేసేవారికి తప్పనిసరిగా మంచే జరుగుతుందని, తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గతంలోనే చెప్పారని, ఇచ్చిన మాటను తప్పరని అన్నారు.
తనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం మీడియాకు తెలిపారని, తనను దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకున్న రోజే తనకు జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని కర్నె ప్రభాకర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తామని, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో ముందుంటానని చెప్పారు. నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.