By: నాగవర్ధన్ రాయల
మలి ఉద్యమంలో ఆయనొక పాటల పూదోట.. న్యాయవాదుల ఉద్యమానికి ఓ సమర గీతం.. చంద్రదండు దాడిలో తలపగిలి నెత్తురోడుతున్నా.. నినాదాన్ని వీడని ఉద్యమ గొంతుక! ఉన్నదంతా పోగొట్టుకున్నా.. అక్షరసమరాన్ని మాత్రం ఆపేది లేదన్నడు! కొవ్వొత్తిలా కరుగుతున్నా.. ఉద్యమం వెలుగుతున్నదని సంతోషించిండు.. లాయర్ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి! ఆయనే ఈ వారం ములాఖాత్ అతిథి..
మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, కుర్మిద్ద. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. అయిదుగురు అన్నలు, ఒక అక్క. ఇంట్లో నేనే చిన్నోణ్ణి. అమ్మ(కమలమ్మ), నాన్న(మల్లారెడ్డి)లు కష్టపడి మమ్మల్ని చదివించిన్రు. పదోతరగతి వరకు ఆకులమైలారం జెడ్‌పీఎస్, నాంపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తయినంక సికింద్రాబాద్‌లోని ఎస్‌పీ కాలేజ్‌లో డిగ్రీచేసిన. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్.ఎల్.ఎం చదివిన. గత 26 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోనే న్యాయవాదిగా పనిచేస్తున్నా.
మా చిన్నాన్న కొడుకు గోపిరెడ్డి చెన్నారెడ్డి అని.. 69ఉద్యమంలో పాల్గొన్నడు. అప్పట్లో ఆయన్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు కానీ ఉద్యమ ఉధృతి తగ్గడంతో ఆ ప్రమాదం తప్పింది. ఆ టైమ్‌లో మా అన్న పడ్డ కష్టాలొక్కటే తెలుసు కానీ నిజంగా తెలంగాణకు జరిగిన అన్యాయాలన్నీ 1996 తర్వాతే తెలుసుకున్నాన్నేను! 1996లో ఇంద్రారెడ్డి జై తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండు. నేను కూడా అందులో భాగం పంచుకున్నా. ఆరు నెలల తర్వాత ఆయన కాంగ్రెస్‌లో కలిసిండు. 2001లో కేసీఆర్ పార్టీ పెడుతుండని తెలిసి జలదృశ్యం సమావేశానికి పోయిన. అప్పట్నుంచి ఉద్యమంలో ఏ కార్యక్రమం జరిగినా నా బాధ్యతకొద్దీ పాల్గొంటూనే ఉన్నా!
రెండు కళ్లు సైగ చేసినయ్!
ఒకరోజు.. ధరల పెరుగుదలని నిరసిస్తూ టీడీపీ నేతలు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్నరు. తెలంగాణ న్యాయవాదులం అక్కడికి వెళ్లి జై తెలంగాణ నినాదాలు చేసినం. చూడండి తమ్ముళ్లు! వాళ్లకు చప్పట్లతో సమాధానం చెప్పండి అని చంద్రబాబు కనుసైగ చేసిండు. అంతే అక్కడున్నోళ్లు మందలా వచ్చి న్యాయవాదులపై పడ్డారు. నేను తీవ్రంగా గాయపడ్డా. రక్తస్రావం ఎక్కువవ్వడంతో కోమాలోకి పోయిన. ఆ దాడి జరిగిన తెల్లారే జేఏసీలో నుంచి టీడీపీని బహిష్కరించిన్రు. మృత్యుముఖం దగ్గరికి వెళ్లిన నేను మూడో రోజు బతికి బయటపడ్డా. గాయం మానింది కానీ దాని తీవ్రత తగ్గలేదు. మూత్రాశయం పనితీరు మందగించింది. వైద్యులను సంప్రదిస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ విశ్రాంత సమయంలోనే అవిశ్రాంతంగా ఉద్యమం కోసం కవితలు, గేయాలు రాయడం మొదలుపెట్టాను. సకల జనుల సమ్మెకు ప్రేరణగా న్యాయ సంగ్రామం అనే ఆడియోను విడుదల చేశాను. బీజేపీ తెలంగాణ పోరు యాత్ర విజయవంతానికి సీడీ విడుదల చేసిన. ఛలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఛలో ఢిల్లీ పేరుతో మరో ఆడియోను విడుదల చేసిన. 2012లో తెలంగాణ ప్రజాఫ్రంట్ తలపెట్టిన క్విట్ తెలంగాణ కార్యక్రమ ప్రచారం కోసం క్విట్ తెలంగాణ బాగోరె ఆంధ్రావాలా ఆడియోని రూపొందించిన. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కోసం 5 ఉద్యమ గీతాలు రాసిన.
ఆ ఆడియోను ఊరూరా ఉద్యమ ప్రచారం కోసం 5 వేల సీడీలను గ్రామాలకు పంపిణీ చేసిన. తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కార్ వివక్షకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తలపెట్టిన కలం కవాతులో నా పాటలు కదం తొక్కాయి. ఆ తరువాత.. మాటతప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఓ పాటరాసి ఏంజిల్ ఆఫ్ తెలంగాణ ఆడియోని విడుదల చేసిన. నమస్తే తెలంగాణలోని శీర్షికలతో దాని ఔన్నత్యాన్ని చాటుతూ నమస్తే తెలంగాణ స్ఫూర్తి గీతం రాసిన. చేతిలో చిల్లిగవ్వ లేకుంటే బంగారు గొలుసు, లాకెట్‌ను బ్యాంకులో తాకట్టుపెట్టి ఆ డబ్బుతో ఆడియోను రూపొందించిన!
దెబ్బ మీద దెబ్బ
మిలియన్ మార్చ్‌లో ఒళ్లంతా కమిలిపోయేలా కొట్టారు పోలీసులు. మళ్లీ 27 రోజులు దవాఖానలో ఉన్నా. డిశ్చార్జ్ అయిన రెండు నెలలు ఇంట్లోనూ కదలలేదు. ఒంట్లో బాగోలేదని ఉద్యమానికి దూరంగా ఏనాడూ ఉండలేదు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నా నేను మాత్రం మానుకోట దండయాత్రకు అడ్డునిలిచేందుకు పోదల్చిన. స్నేహితుడు గోవర్ధన్ రెడ్డి సహాయంతో ఒక రోజు ముందే మానుకోటకు చేరుకున్నం. మానుకోట ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొని సమైక్యవాదంపై నా వంతుగా రాయి విసిరిన. కళ్లముందు కనిపించిన ఆనాటి దశ్యాలను కవిత్వంలోకి తీసుకొచ్చి మానుకోట ఘటన – అది మరపురాని ప్రతిఘటన… రగులుతున్న తెలంగాణ ఉద్యమ విస్ఫోటన అంటూ గేయం రాశాను. ఆడియోని రూపొందించిన.
ఉద్యమానికి నేనేమిచ్చాను!
మంచి లాయర్‌గా ప్రాక్టీసులో ఉన్న నా వద్ద 2009 వరకు ఇద్దరు జూనియర్ లాయర్లు, ఒక క్లర్కు, టైపిస్ట్ ఉండేవాళ్లు. ఇప్పుడు కేసులే కాదు ఆ జూనియర్లు కూడా మానేశారు. చివరికి ఆర్థిక స్థోమత క్షీణించడంతో ఆఫీసులో నేనొక్కడినే. కేసులు తగ్గడం ఒక విధంగా మేలే చేసింది. ఎందుకంటే క్లయింట్లు, కంప్లయింట్లు లేని టెన్షన్ ఫ్రీ లైఫ్ పాటలు రాయడానికి, ఉద్యమానికి బాగా ఉపయోగపడింది. ఆర్థికంగా చితికినా, సంతృప్తిగా బతికిన. ఇప్పటి వరకు 100 పాటలు రాసిన. 44 ఆడియో రికార్డ్‌లు చేయించిన. 15 వేల సీడీలను తెలంగాణ పల్లెపల్లెకు అందించిన. వీటి కోసం 12 లక్షల రూపాయలు ఖర్చు చేసిన కానీ ఎవరి దగ్గరా రూపాయి తీసుకోలేదు.
ఇస్తామన్నా ఉద్యమాన్ని అవసరాల కోసం వాడుకోలేదు. నన్ను పరామర్శించినప్పుడు వైద్య ఖర్చులన్నీ టీఆర్‌ఎస్ భరిస్తుందని కేసీఆర్ భరోసానిచ్చారు. కానీ ఉద్యమానికి, ఉద్యమ పార్టీకి భారం కాకూడదని వద్దన్నాను. అనారోగ్యంతో ఉంటే ఇల్లు తాకట్టుపెట్టాను కానీ ఎవరినీ రూపాయి అడగలేదు. ఉద్యమాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోవడం తప్పని నా భావన. ఉద్యమం మనకేమిచ్చిందని కాదు. ఉద్యమానికి నేనేమిచ్చాననే ఆలోచించాను. ఆలోచిస్తాను కూడా!
విషపు కోరలు పీకిన!
తెలంగాణను చూడకుండనే మా అన్న మరణించిండు. ఆయన అనారోగ్యానికి, మరణానికి ఆనాటి గాయాలే కారణం. న్యాయవాదుల ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న నేను ఆ గాయాల కసి తీర్చుకున్న. ఉద్యమంపై అక్కసుకక్కేవాళ్ల పనిపట్టిన. తెలంగాణపై విషం కక్కేవాళ్లపై కేసులు పెట్టి కోరలు పీకినంత పనిజేసిన. మోహన్‌బాబుపై పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేయించిన. సీమాంధ్ర మీడియాపై హైకోర్టులో పిల్ వేసిన. హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో కేసు పెట్టిన. చంద్రబాబుపై చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవడు విషం కక్కినా స్పందించి నిలదీసిన. పోరాటంలో బరిగీసి నిలిచిన. ఇందిరాపార్కులో నేను చిందించిన రక్తం, మా అన్న త్యాగం వృథా కాలేదు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..