ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమ ఉప్పెనలో సీ ఎం కిరణ్ నామరూపాలు లేకుండా కొట్టుకపోతడని హరీష్ రావు అన్నారు. కరీంనగర్ నగర్ జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లి లో పలువురు హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫైలిన్ తుఫానును అడ్డుకోలేకపోయానని, విభజన తుఫానును అడ్డుకుంటానని బీరాలు పలుకుతున్నాడని ధ్వజమెత్తారు. కిరణ్ ఎక్ స్ట్రా జోకర్ అని, అటు సీమాంధ్ర ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు అతి త్వరలో ఆయనను పక్కన పెడతారని జోస్యం చెప్పారు.
హైదరాబాద్ లో పోలీసు, విద్య, ఆదాయంపై హక్కులు కావాలని ఆరాటపడుతున్నారని, అవి సాధించడం కలలో కూడా సాధ్యం కాదని ఆయన అన్నారు. హైదరాబాద్ లో అవకాశాలు కావాలని సీమాంధ్రులు గగ్గోలు పెడుతున్నారని, అప్పుడు తెలంగాణ బిడ్డలు దుబాయ్, ముంబాయ్ పోవాలా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు షర్మిల హైదరాబాద్ ను పాకిస్తాన్ తో పోల్చారని, ఇప్పుడు ఆమెకు హైదరాబాద్ కావల్సివచ్చిందా అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమన్నారు.