రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక విద్యాసంస్థకు కొండా పేరును పెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యానవన యూనివర్సిటీకి ఆయన పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం హర్షణీయమని, సీఎం నిర్ణయాన్ని నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని ఇందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.