mt_logo

రెండు ఓట్లు టీఆర్ఎస్ కే వేయాలి- కేసీఆర్

సోమవారం తెలంగాణ భవన్లో నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన సీపీఐ, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వేసి 17 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రం మెడలు వంచాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు బంగారు తెలంగాణ సాధించాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రెండు ఓట్లూ టీఆర్ఎస్ పార్టీకే వేయాలని అన్నారు. కొంతమంది అసెంబ్లీకి టీఆర్ఎస్ కు, పార్లమెంటుకు బీజేపీకి ఓట్లు వేయాలని అనుకుంటున్నారని, మోడీలు, గీడీల వల్ల ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు. మన సంగతి మనమే చూసుకోవాలని, కేంద్రంలో మనం బలంగా ఉంటేనే ప్రాజెక్టులు కేటాయించడంలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం దిగివస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రా నాయకులైతే ఏకంగా మమ్మల్ని గెలిపిస్తే రెండు రాష్ట్రాలను ఒక్కటిగా చేస్తామని గోతికాడి నక్కల్లా వెనకే ఉన్నారని, వారి ఆటలు సాగకుండా ఉండాలంటే మనం డిల్లీని కమాండ్ చేయగలిగే స్థాయిలో ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రజలంతా భ్రమలు వదిలిపెట్టి తెలంగాణ బతుకు చూసుకోవాలని, దేశాన్ని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారని, కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల సమస్యలు తీరుస్తామని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అరచేతిలో స్వర్గం చూపించారని, బోర్లు వేసీ వేసీ తెలంగాణ అంతటా ఎండిపోతున్నదని వాపోయారు. ‘ఇల్లు కూల్చిన మేస్త్రీకే మళ్ళీ పని ఇవ్వొద్దు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు మళ్ళీ ప్రజలవద్దకు వస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో పని చేయాలనే అంటున్నా. అందర్నీ వెళ్ళమని నేను మాట్లాడట్లే. అక్రమంగా తెలంగాణలో కొలువులు పొందిన కొంతమంది ఆంధ్రా వాళ్ళనే వెళ్ళమని చెప్తున్నా’నని కేసీఆర్ చెప్పారు. దళితుల కోసం 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమిని కేటాయిస్తామని, ఇల్లు లేని వారికి మూడు లక్షల రూపాయలతో అన్ని వసతులతో కూడిన పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని కేసీఆర్ తెలంగాణ ప్రజానీకానికి హామీలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *