శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నంతోపాటు వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఎంపీ కవితతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఇంటింటికీ తాగునీటిని అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం రూ. 25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్యలకు ఆంధ్రా పాలకులే కారణమని, సమన్యాయం, సమధర్మం అనే చంద్రబాబు తన వద్ద ఉన్న గ్యాస్ తో ఒక్క చోటైనా కరెంట్ ఉత్పత్తి కేంద్రం పెట్టారా? అని, రాష్ట్ర విభజన సమయంలో 54 శాతం కరెంట్ ఇస్తామని ఒప్పుకున్నది నిజం కాదా? అని ఈటెల ప్రశ్నించారు.
మాటకు కట్టుబడి రుణమాఫీ చేశామని, మొదటి విడతగా రూ. 4,250 కోట్లను విడుదల చేశామని, రైతే రాజు అన్న మాటను టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలో నిరూపిస్తుందని, 2015 -16 లోగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని అన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, కరెంట్ సమస్యను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, త్వరలోనే వ్యవసాయానికి విద్యుత్ కొరత తొలగిపోతుందని అన్నారు. బీడీ కార్మికుల సంక్షేమానికి సీమాంధ్ర పాలకులు కేంద్రం నుండి ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని, కార్మికులందరికీ ఇళ్ళ నిర్మాణం, వారి సంక్షేమం కోసం కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.