రాష్ట్ర విద్యుత్ అవసరాలను నెరవేర్చే క్రమంలో ఈ ఏడాది చివర్లోగా సౌర విద్యుత్ ను అందుబాటులోకి తేవాలని, సౌర విద్యుత్ టెండర్లను త్వరలో ఖరారు చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో విద్యుత్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి, ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ డీ ప్రభాకర్ రావు, సదరన్ డిస్కం సీఎండీ జీ రఘుమారెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సదరన్ డిస్కం టెండర్లను ఆహ్వానించగా మొత్తం 108 కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. కనిష్ట యూనిట్ ధర రూ. 6.45 నుండి గరిష్ఠ ధర రూ. 6.90 వరకు 34 ప్రైవేట్ కంపెనీలు కోట్ చేశాయి. వీటిని సదరన్ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, సౌర విద్యుత్ యూనిట్ ధరను రూ. 6.45లుగా ఖరారు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.