సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రైల్వే ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని, ఎంతోకాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న నూతన రైల్వే ప్రాజెక్టుల అనుమతుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా మార్చాలని, వరంగల్ లో రైల్వే యూనివర్శిటీ ఏర్పాటుచేయాలని, ఏపీ ఎక్స్ ప్రెస్ ను తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని, హైదరాబాద్ లో మరికొన్ని స్టేషన్లు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కోరారు.
నిజాం రాజుల హయాంలో రైల్వే శాఖకు వేలకొద్దీ ఎకరాల భూమిని ఉచితంగా అందజేశారని, మెట్రో రైలు నిర్మాణంలో స్థలాలు అవసరమైన చోట రైల్వే శాఖ కూడా సహకరించేలా చూడాలని, విభజన చట్టం ప్రకారం హామీ ఇచ్చినా ఇంతవరకూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ముందుకు పోవట్లేదని కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. మౌలాలి, నాగులపల్లి రైల్వే స్టేషన్లను పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆధునీకరించాలని, దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా తాకకుండా వెళ్తున్న రైలుకు ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు ఉండటం సరైంది కాదని, దానిని వెంటనే తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చాలని సీఎం కేసీఆర్ కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సురేశ్ ప్రభు రాష్ట్రంలోని వివిధ పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తానని, హైదరాబాద్ నగరంపై కూడా ప్రత్యేకంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.