తెలంగాణా విషయంలో సీమాంధ్ర మీడియాది ఒకటే ఎజెండా. నిజాలకు పాతరేయడం, అర్థ సత్యాలను అల్లేయడం, ఒక్కోసారి మరీ బరితెగించి పచ్చి అబద్ధాలను అలవోకగా ఆడేయడం.
మొన్న కేంద్ర హోం మంత్రిగా సుశిల్ కుమార్ షిండే నియమితుడు అవగానే టీవీ9 ఆయన విదర్భకు చెందినవాడని, అక్కడ కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉన్నది కాబట్టి తెలంగాణ అంశంపై ఆయన నిర్ణయం తీసుకోవడం కష్టమని చంకలు గుద్దుకుంది.
అణువణువూ తెలంగాణ వ్యతిరేకతతో నిండిన ఈ చానెల్ ఇలాంటి పచ్చి అబద్ధాలను అడేముందు ఒకసారి కనీసం వికీపీడియానయినా చెక్ చేసుకోవాల్సింది. సుశీల్ కుమార్ షిండేది విదర్భ కాదు. ఆయన పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూరుకు చెందిన వ్యక్తి.
ఒకసారి వికీపీడియాలో ఆయన నేపధ్యం గురించి ఏమున్నదో చూడండి:
భారత ప్రభుత్వ వెబ్ సైటులో ఆయన పూర్తి ప్రొఫైల్ ను ఇక్కడ చూడొచ్చు :
http://www.india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=423
కింద మ్యాపు ఒకసారి పరిశీలించండి. మహారాష్ట్రలో మొత్తం అయిదు ప్రాంతాలు ఉన్నాయి. అవి:
విదర్భ – (నాగ్ పూర్ మరియు అమరావతి డివిజన్లు)
మరఠ్వాడా – (ఔరంగాబాద్ డివిజన్)
ఖాందేష్ మరియు ఉత్తర మహారాష్ట్ర – (నాసిక్ డివిజన్)
దేష్ లేదా పశ్చిమ మహారాష్ట్ర – (పూణే డివిజన్)
కొంకణ్ – (కొంకణ్ డివిజన్)
విదర్భ ఎక్కడుందో, షోలాపూర్ ఎక్కడుందో ఒకసారి చూడండి.
అయినా టీవీ9 అజ్ఞానులు భావిస్తున్నట్టు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం హోం మంత్రి ఒక్కడే “సెటిల్” చేసే అంశం కాదు. కేంద్ర ప్రభుత్వ సమష్టి నిర్ణయాన్ని ఆయన అమలు చేస్తాడంతే.
మెరుగైన సమాజం కొరకు అంటూ సమాజంలోని ఎక్కడెక్కడి చెత్తనో పోగేసి చూపించే ఈ చానెల్ తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో మాటిమాటికీ తెలంగాణ ఉద్యమంపై విషప్రచారం చేస్తుండటంతో చిర్రెత్తిన తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఏకంగా ఈ చానెల్ ను కొన్ని రోజులపాటు నిలిపివేశారు. మరోసారి ఇలా చెయ్యమని అప్పట్లో లెంపలు వేసుకున్న టీవీ9 మళ్లీ తన తోక వంకరేనని ఇటువంటి అబద్ధపు వార్తలతో నిరూపించుకున్నది
సీమాంధ్ర మీడియా తెలంగాణపై చేస్తున్న ఇటువంటి అబద్ధపు ప్రచారమే మన యువతలో నిరాశ, నిస్పృహలకు కారణమవుతుంది. వారిని ఆత్మహత్యలకు పురికొల్పుతుంది.
అందుకే మనం సీమాంధ్ర మీడియా చూసి దమాఖ్ ఖరాబ్ చేసుకునుడు బంద్ పెట్టాలె. ఈ విషపు మీడియాను బొందపెట్టి తెలంగాణ మీడియాను ఎత్తిపట్టాలె.