రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే మూడేండ్ల వయోపరిమితి పెంచగా… అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో రెండేండ్ల వయోపరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగ అభ్యర్థుల విన్నపాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ను, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించే విషయంపై సాయంత్రం వరకు స్పష్టత రానుంది. కాగా పోలీసు ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. శుక్రవారంతో దరఖాస్తులకు గడువు ముగుస్తున్నది. అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

