తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం.
ఒకే ఒక్కడు కేసీఆర్ మాట గౌరవించి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు.
మన రాష్ట్రంలో మన పాలన అన్న నినాదం వృధా పోలేదు. టీఆర్ఎస్ సునామీలో మహామహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మట్టికరిచారు. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 63 స్థానాలు గెలిచి సొంతగా తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గులాబీ అధినేత సిద్ధమయ్యారు. 17 ఎంపీ సీట్లలో 11 సీట్లు సాధించి కేంద్రంలో కూడా తన హవా కొనసాగించేందుకు టీఆర్ఎస్ దూసుకెళ్ళింది. పది జిల్లాల్లో విజయదుందుభి మోగించిన టీఆర్ఎస్ కొన్ని జిల్లాల్లో 8 నుండి పన్నెండు సీట్లను కైవసం చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని, కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు కైవసం చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని, 7 అసెంబ్లీ సీట్లను, వరంగల్ జిల్లాలో 8 అసెంబ్లీ సీట్లు, వరంగల్, మహబూబాబాద్ ఎంపీ సీట్లను సాధించుకుంది. నల్లగొండ జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలను, భువనగిరి ఎంపీ స్థానాన్ని, ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎంపీ, 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. మెదక్ జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు, రంగారెడ్డిలో 4 అసెంబ్లీ స్థానాలను, చేవెళ్ళ ఎంపీ సీటును కైవసం చేసుకుంది. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ సీటును సాధించి అక్కడ ఖాతా తెరిచింది. హైదరాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కత్తి పద్మారావు విజయం సాధించారు.