mt_logo

స్పీడందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..

రాష్ట్రంలో త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో గత మూడురోజులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈనెల 3 నుండి కళాశాలలు, 5 వ తేదీ నుండి పాదయాత్రలు, ఇతర సమావేశాలు చేపట్టనున్నారు. ఈ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ ఇప్పటికే హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి పట్టభద్రులను స్వయంగా కలుస్తున్నారు. ఆదివారం కర్మాన్ ఘాట్ లో తెలంగాణ ట్రెజరీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం జంగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి దేవీప్రసాద్ హాజరయ్యారు.

మరోవైపు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావులతో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు మదన్ లాల్, కోరం కనకయ్యలతో కలిసి జిల్లా కేంద్రం, ఇల్లెందు, వైరాల్లో ప్రచారం ముగించారు. ఆదివారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన వరంగల్ లో అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి చందూలాల్, జిల్లా ఎమ్మెల్యేలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

ఇదిలాఉండగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటరీ కార్యదర్శులు, జెడ్పీ చైర్మన్లు తదితరులతో పర్యాటక శాఖకు చెందిన హరిత ప్లాజా హోటల్ లో ఆదివారం రాష్ట్రమంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని, మెదక్ ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలతో ఉన్న అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *