ఆదివారం మాదాపూర్ లో నూతనంగా నిర్మించిన సన్ షైన్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని మెడికల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో తాజాగా సన్ షైన్ వంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించడం శుభపరిణామమని, ఇలాంటి ఆస్పత్రులు మరిన్ని రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిభట్లలో సన్ షైన్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే దానికి కావలసిన స్థలం ఏర్పాటు చేస్తామని, సన్ షైన్ వైద్యసేవలు కేవలం నగరానికే పరిమితం కావద్దని, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కూడా విస్తరించాలని సీఎం కేసీఆర్ హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు.
సీ నారాయణ రెడ్డిని పరామర్శించడానికి తాను మొదటిసారిగా సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆస్పత్రిని సందర్శించానని, ఆ సమయంలో నీ స్పెషలిస్ట్ డాక్టర్ గురువారెడ్డి గురించి తెలుసుకున్నానని గుర్తు చేశారు. గురువారెడ్డి అన్నా, ఆయన సన్ షైన్ ఆస్పత్రి అన్నా తనతో పాటు ప్రజల్లో మంచి విశ్వాసం ఉందని, నీ స్పెషలిస్టుగా 25 వేల సర్జరీలు చేసి వైద్య రంగంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని సీఎం కీర్తించారు. అనంతరం సన్ షైన్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, ఆయన సూచనల మేరకు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. తమకున్న మూడు ఆస్పత్రులలో 900 పడకలు, 3 వేలమంది సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నాయని, త్వరలోనే గుల్బర్గా, నెల్లూరు, భువనేశ్వర్ లలో కొత్త శాఖలను ప్రారంభిస్తున్నామని గురువారెడ్డి చెప్పారు.