mt_logo

టీఆర్ఎస్ పార్టీది ఒంటరిపోరే- కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో పొత్తులుండవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. 75 అసెంబ్లీ, 14 ఎంపీ స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 35 స్థానాలు మించి రావని, తెలంగాణ మంత్రి అయిఉండీ పొన్నాల ఆంధ్రా తొత్తుగా మారి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాడని, పొన్నాలపై సీబీఐ కేసు కూడా ఉందని విమర్శించారు. అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడుతున్నాడా అని పొన్నాల చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ, కేసీఆర్ ను విమర్శించే హక్కు పొన్నాలకు లేదని, జలయజ్ఞం పేరిట వేల కోట్లు దోచుకుంది నువ్వు కాదా? అని, నీలాగా జేబులు, పొట్టలు అభివృద్ధి చేసుకునే అలవాటు మాకు లేదని కేసీఆర్ మండిపడ్డారు. రెండు ప్రాంతాల్లో చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడని, శ్రీకాకుళంలో జరిగిన సభలో మాట్లాడుతూ, తెలంగాణ బిల్లు ఆపడానికి కావాల్సిన ఎంపీల సంఖ్య తనదగ్గర తక్కువగా ఉందని, ఏమాత్రం అవకాశం ఉన్నా బిల్లు ఆమోదం పొందకుండా ఆపేవాడినని అన్నాడని గుర్తుచేశారు. అదే చంద్రబాబు వరంగల్ సభలో మాట్లాడుతూ, నేను లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని అన్నాడని, రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందని కేసీఆర్ నిప్పులు చెరిగారు. అలాంటి పార్టీలకు ఓటు వేస్తే ప్రయోజనం ఉండదని, బంగారు తెలంగాణ సాధించాలంటే తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి గెలిపించుకోవాలని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *