ఇవ్వాళ తెలంగాణది ఒక విచిత్ర పరిస్థితి. వాదం న్యాయమైనదేనని పార్టీలన్నీ మద్దతు తెలుపుతాయి. అయినా అందరి అభిప్రాయాలు కావాలంటూ దశాబ్దాలుగా దాటవేస్తుంటారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తెలంగాణ ఏర్పడుతుందని కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. కానీ కనిపించని ప్రలోభాలకు లొంగి కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లబుచ్చుతారు నీతిలేని కాంగ్రెస్ నేతలు. ఫ్లకార్డులు చేబూని పార్లమెంట్‌లో వ్యతిరేకించినవారే పాదయాత్రలతో ఈ నేలను పాపపంకిలం చేస్తారు. అవునన్నవన్నీ కాదంటారు. శత్రువు పరాయివాడొక్కడే కాదు. ఈ మట్టిలోనే పుట్టి, ఈగాలినే పీల్చి, ఈ తల్లి రుణం తీర్చే బాధ్యతను కలిగి ఉండి కూడా, రాజకీయ దాసోహంతో పాలు తాగిన రొమ్మునే గుద్దుతున్న ఇక్కడి నేతలూ ప్రమాదకర శత్రువులే! ఆశలు ఆవిరైపోతుంటే, కలత చెందిన యువకుడొకడు చెట్టుకు శవమై వేలాడుతుంటాడు. ఉద్యమం, జీవితం వేరు వేరు కావన్న రాజకీ య చైతన్యంతో విద్యార్థులు లాఠీలకు, తూటాలకు ఎదురునిల్చి తెలంగాణను జీవన్మరణ సమస్యగా ఉద్యమంలో ముందు నిలుస్తారు.
మరోవైపు రాజకీయ బానిసత్వంతో స్వప్రయోజనాలనాశించి, సీమాంధ్ర్య్లకు రాజకీయ ఊడిగం చేస్తారు ఈ ప్రాంత దిగజారుడు రాజకీయవారసులు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య, ఇన్ని కుట్రలు కుతంవూతాల నడుమ తెలంగాణ పరిష్కారం దొరకని ప్రహేళికలా మిగిలిపోతూనే ఉన్నది.తాను ఒక కలకని, ఆ కలను సాకారం చేయడానికి సకల తెలంగాణ శక్తుల్ని ఏకం చేసిన వారు కేసీఆర్. భోగాల రాజకీయ వ్యవస్థలో త్యాగాల రాజకీయ విలువలకు కొత్త నిర్వచనం చెప్పిన సాహసోపేత నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. రాజకీయ ప్రక్రియ ద్వారా అహింసామార్గంలో తెలంగాణను సాధించాలన్న లక్ష్యంతో ఉద్యమాన్ని ఆరంభించారు. లక్ష్యసాధనలో అనేక రాజకీయ ఎత్తుగడల ద్వారా ఉద్యమానికి సర్వత్రా మద్దతును సాధించడమే కాకుండా, తెలంగాణ ఇవ్వక తప్పని అనివార్యతను సృష్టించగలిగారు. తాను బలిపీటమెక్కి కేంద్రాన్ని ఒప్పించి, తెలంగాణ ప్రకటనను రప్పించి, చరిత్రలో నిలిచిపోయిన పోరాటయోధుడు కేసీఆర్.
సకల తెలంగాణ శక్తులు ఏకమై చేసిన మహోన్నత పోరాట ఫలితంగా నేడు ఉద్యమం తుదిదశకు చేరుకున్న సందర్భం ఇది. అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని త్యాగాలు ఫలించిఅంతిమ విజయం అందుకోబోయే తరుణం! వేయిమంది యువకులు ఈ మాతృభూమిపై మమకారంతో ప్రాణత్యాగాలతో చరిత్రకు రక్త తిలకం దిద్దిన నేపథ్యం! సకల వర్గాలు, సబ్బండ వర్ణాలు ఉద్యమంలో దారిపొడువునా పోరు జెండాలు ఎగరేస్తూ సాగిపోతున్న సమయం. తెలంగాణ మొత్తం ఏకతాటిపై నిలిచి పోరాడిన ఫలితంగా, విజయాన్ని ముద్దాడబోతున్న సంబరం! కానీ మిత్రులారా! నీచ రాజకీయాల చేతిలో తెలంగాణ మోసగించబడుతున్నది. పాపులు పన్నిన కుట్రల్లో పరిస్థితి తల్లకిందులయ్యింది. పంటచేతికి వచ్చే సమయంలో పైరుకు మంటపెట్టినట్టు , ముద్దనోట్లో పెట్టుకోబోయే సమయంలో గద్దలచ్చి తన్నుక పోయినట్లు, ప్రకటించిన తెలంగాణలో పండుగలైనా చేసుకోక ముందే వచ్చిన తెలంగాణను వెనక్కు మరల్చిన దగుల్భాజీ రాజకీయాలను మనం చూశాం. కల చెదిరిపోయి, కన్నీటి కథలు మిగిలిపోయిన ఒడవని దుఃఖస్థితిని మనం అనుభవించాం. ఇది నిన్నటి చరిత్ర.
వర్తమానంలో మన కర్తవ్యం ఏమిటి? గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నట్టు తెలంగాణ ఉద్యమం వ్యవస్థను కూల్చే సాయుధ పోరాటంకాదు. ఇది రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్‌లో బిల్లుపెట్టడం ద్వారా సాధించుకునే ప్రజాస్వామిక ప్రక్రియ. మరి ఇది కార్యరూపం దాల్చి తెలంగాణ సాధించుకోవాలంటే, ఉద్యమాలను ఉధృతం చేసి, రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి న్యాయ సమ్మతమైన మన డిమాండ్‌ను నెరవేర్చుకోవలసిన ఒక రాజకీయ అనివార్యతను సృష్టించాలి. రాజకీయ అవసరాలు, అనివార్యతలే రాష్ట్రాన్ని సాధించి పెడతాయి. ఇందుకోసం తెలంగాణ సాధించుకోనే వరకు ఏలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతూ, సీమాంధ్రుల కుట్రలను, కేంద్ర ప్రభుత్వ బలాబలాల సమీకరణాల జిమ్ముక్కులను ఎండగడుతూ అలుపెరుగని, అమ్ముడుపోని రాజకీయశక్తి అవసరం. ఆశక్తిని యుక్తిని, నిబద్ధతను, నిజాయితీని కలిగి ఉన్నపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తెరాసకు తెలంగాణ రాష్ట్ర సాధన, ఆపిదప ఆర్థిక సామాజిక, సాంస్కృతిక వికాసంతో కూడిన తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తప్ప వేరే ఎజెండా ఏదీలేదు. ఇంతటి బృహత్తర బాధ్యత భుజాలకెత్తుకున్న తెరాసకు తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు అండగా నిలిచినప్పుడే రెట్టించిన బలంతో కేంద్రంతోనైనా, సీమాంధ్ర నేతలతోనైనా ఢీకొనే అవకా శం ఉంటుంది. అందుకోసం ప్రతి ఎన్నికల్లో పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా నిలిపినప్పుడే అది సాధ్యమవుతుంది.
ఇవాళ ప్రతి రాజకీయపార్టీ తెలంగాణకు సై అన్నా మరి ఎందుకు తెలంగాణ ఏర్పడడం లేదు? ప్రతి పార్టీ మనుగడ కోసం తెలంగాణకు నినాదమావూతంగా జై అంటున్నాయి. కానీ విధానపరంగా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నాయి. కాంగ్రె స్, టీడీపీ, వైకాపా తెలంగాణ కోసం ప్రజా క్షేత్రంలో ఎప్పుడైనా కలిసి వచ్చాయా? తెలంగాణ కోసం, అసెంబ్లీ, పార్లమెంటు వేదికల్లో ఏనాడైనా అనుకూలంగా ప్రవర్తించాయా? విద్యార్థులతో కలిసి ఉద్యమంలో కలిసి నడుస్తున్న పార్టీలేవి? సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతున్నప్పుడు వారితో కలిసి ఐక్యశక్తిగా ఉద్యమించకుండా, నాయకులు కలుగుల్లో దాక్కొని పత్రికా ప్రకటనలకు, టీవీ డిబేట్లకు మాత్రమే ఎందుకు పోజులిచ్చి మాట్లాడుతున్నారు? పైగా ఓట్లకోసం తెరాసపై కొనుక్కున్న గొంతు ద్వారా ఎందుకు విషం కక్కిస్తున్నారు? ఎందుకు ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.
ఉద్యమంలో ఇవ్వాళ ఒక స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తున్నది. సకల జనులతోటి మమేకమై ఉద్యమంలో భాగస్వామ్యమై కదిలి వస్తున్న పార్టీలు ఏవి? ఉద్యమానికి దూరంగా, సీమాంవూధులకు దగ్గరగా ఉంటున్న పార్టీలు ఏవి? పరీక్షకు నిలవాల్సి వచ్చినప్పుడు పదవులను, తెలంగాణకోసం ఏకం గా పార్టీనైనా త్యాగం చేస్తున్నదెవరు? సమైక్య వాదులైన ముఖ్యమంత్రి , మంత్రులతో అంట కాగుతూ ఉద్యమ కారుల్ని బలహీనపరిచే కుట్రల్లో భాగస్వాములవుతున్న దెవరు?
తెలంగాణకు జై కొట్టడమంటే వాదాన్ని ప్రేమించాలి. పరీక్షా సమయంలో పదవుల్ని గడ్డి పోచల్లా త్యజించగలగాలి. ద్వంద్వ వైఖరి ప్రదర్శించే పార్టీ నేతల్ని ధిక్కరించగలగాలి.
తెలంగాణ సాధించేవరకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడాలి. ఆ నిబద్ధ త మన పార్టీలకు లేక పోవడం వల్లనే, అన్ని సానుకూలంగా ఉన్నా మన అనైక్యత కారణంగా కేంద్రం నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నది. వెయ్యి మంది యువకులు ఉద్యమం కోసం ప్రాణాలను కోల్పోయినా జంకు గొంకు లేకుండా పట్టనట్లు వ్యవహరిస్తుందంటే కేవలం మనం రాజకీయంగా బలమైన శక్తిగా ఏకీకృతం కాలేక పోవడమే. ప్రజల మద్ధతు లేకున్నా, మేధావులు వ్యతిరేకిస్తున్నా, జాతీయ స్థాయి లో ఒక్క పార్టీ సపోర్ట్ లేకున్నా, కేవలం సీమాంధ్ర అన్ని పార్టీలు ఏకమై తమ ధనబలాన్ని ప్రదర్శిస్తున్నందువల్లే సమైక్యవాదులు తెలంగాణను ఎప్పటికప్పుడు వాయిదా వేయించగలుగుతున్నారు. ఇదంతా సాదృశ్యంగా కనిపిస్తున్నా మన నేతలకు సిగ్గులేదు. తాము ఉద్యమంతో మమేకం కాకుండా, ఉద్యమకారులకు అడ్డుతగులుకుంటూ.. శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ తన వ్యూహాలన్నింటినీ 2014 ఎన్నికలతోనూ, రాహుల్‌ను ప్రాధాని చేయాలన్న సంకల్పంతోనూ ముడి వేసుకుని ఉన్నది. ఇలాంటి సందర్భంలో సీమాంవూధులు సీట్ల లెక్కలను కేంద్రానికి చూపించి పభావితం చేస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా అటు జగన్‌ను జైలునుంచి విముక్తి చేయించేలా, ఇటు తెలంగాణ డిమాండ్‌ను శాశ్వతంగా కనుమరుగు చేసేలా కేంద్రాన్ని ప్రభావితం చేయడానికి పావులు కదుపుతున్నారు. ‘భావి ప్రధానిని నిర్ధారించేది జగనే’ అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. వాళ్ల ఐక్యతా రాగం కేంద్రానికి విశ్వసనీయతను కలిగిస్తున్నది.
తెలంగాణలో చీలికలు, పేలికలు అవుతున్న రాజకీయ శక్తుల్ని చూసి కేంద్రం చులకన భావనను ప్రదర్శిస్తున్నది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో మనం చేయాల్సిన కర్తవ్యం, ఉద్యమ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల ఫలితాలు అన్నీ ఫలితాన్ని నిర్దిశించేవే. కాబట్టి బలమైన ఉద్యమాన్ని రూపొందించుకుంటూనే ఇప్పుడు జరుగబోతున్న పట్టభవూదుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని గెలిపించి, శాసనమండలిలో, రాష్ట్రసాధన కోసం బలమైన గొంతును వినిపించేందుకు, మేధావి వర్గమంతా ఐక్యం కావలసిన సందర్భం ఇది. స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని సాధించుకోవడం ఒక్కటే తెలంగాణకు ఏకైక పరిష్కారమని కేసీఆర్ పదే పదే చెబుతున్న దాన్ని అందరం అర్థం చేసుకోవాలి.
మొన్న జరిగిన సహకార ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినవే అయినా, కొనుక్కోవడమే ప్రధాన ప్రక్రియలా జరిగే ఎన్నికలే అయినా, దొడ్డిదారిలో గెలిచి అత్యధిక సీట్లు సాధించగలిగామని, ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని సోనియా వద్ద ఫోజు కొడుతున్నాడు సీఎం కిరణ్. తెలంగాణ వాదాన్ని, గెలిచిన సీట్లతో ముడిపెట్టి తెలంగాణ వాదం వీగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. సీమాంవూధుల్లాగా మీరు లాబీయింగ్ చేయలేక పోతున్నారని మన ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఆజాద్ మాట్లాడుతున్నాడు . మన ఓట్లతో గెలిచి మనకే వెన్నుపోట్లు పొడుస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అందుకే కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఉద్యమం ఒకవైపు-రాజకీయ ప్రక్రియ మరో వైపు’అన్న నినాదానికి తెలంగాణ సమాజమంతా మద్ధతు ప్రకటించడం రాష్ట్ర సాధనకు ఆవశ్యకమైనది. రాజకీయాలు అనివార్యమైనప్పుడు అవి రాష్ట్ర సాధనను ప్రభావితం చేస్తున్నప్పుడు ఆ రాజకీయాలనే పోరాట అస్త్రాలుగా మలుచుకోవలసిన అవసరం ఉన్నది. ప్రాణవూపదమైన సంస్కృతి పరవశింపజేసే భాష, కర్తవ్యాన్ని నిర్ధేశించే పోరాటాలు తెలంగాణకు ఘన వారసత్వంగా ఉన్నట్లుగానే, తెలంగాణ ఆత్మగా భావించే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలుపుతూ తెలంగాణ ఆశయ సిద్ధి గావించే ఒక రాజకీయ పార్టీని నిర్మించుకోవడం ఇప్పటి చారివూతక అవసరం. ఈ లక్షణాలు , లక్ష్యాలు అన్ని కలిగి ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ రోజు కేసీఆర్ గారి పుట్టిన రోజు. నది పర్వత సానువుల్లో పుట్టి తనదారిని తాను నిర్దేశించుకొని సాగిపోయే దారిలో అనేక పిల్లకాలువల్ని, వాగు వంకల్ని తనలో కలుపుకుని మహా ప్రవాహమై నడిచిన దారంతా పచ్చదనాన్ని పంచి ప్రాణదాతయై నిలచి అంతిమ గమ్యమైన సాగరున్ని చేరుకుంటుంది. అలాగే కేసీఆర్ తెరాస స్థాపనతో ఉద్యమ పాయగా పురుడుపోసుకుని, పోరుబాటలో పయనిస్తూ ఆత్మగౌరవ అస్తిత్వ భావజాలాన్ని పరివ్యాప్తం చేస్తూ కలిసి వచ్చే ఉద్యమ శక్తులన్నింటినీ సంలీనం చేసుకుంటూ, అంతిమ గమ్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా సాగిపోతున్న కారణ జన్ముడు. రేపు లిఖించబోయే వీరతెలంగాణ పోరు చరివూతలో తెలంగాణ సాధకుడుగా చిర స్థాయిగా నిలువక తప్పదు. మన బలమే తన బలంగా చేసుకుని ముందుకు సాగుతున్న కేసీఆర్‌కు మనమంతా అండగా నిలుద్దాం. రావణ సంహారం కోసం తలపెట్టిన వారధి నిర్మాణంలో ఉడుత సాయం ఉడుతది. తెలంగాణ సాధనలో కూడా ఎవరి బాధ్యత వారిదిగా గుర్తించి ..విలువల రాజకీయాల్ని బలపరుద్దాం. నిఖార్సైన తెలంగాణ వాదుల్ని గెలిపిద్దాం. వీరు త్యాగాల రుణం తీర్చుకుందాం. విజ్ఞతతో ఏకమై తెలంగాణ సాధించుకుందాం!
-నారదాసు లక్షణ్‌రావు
శాసనమండలి సభ్యులు
నమస్తే తెలంగాణ సౌజన్యంతో