mt_logo

ఆర్మూర్‌లో తెలంగాణ జనజాతర

 

ఆర్మూర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పుష్కర కాలంలో ఆ పార్టీ నిర్వహించిన అనేక సభల కంటే కనీవిని ఎరుగని రీతిలో, హైటెక్ హంగుల నీడలో ఆవిర్భావ సభ రికార్డు నెలకొల్పింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సభ జరుగగా నాలుగు గంటల పాటు కీలకమైన తీర్మానాలపై ప్రతినిధుల సభ చర్చించింది. పార్టీ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్ మొట్టమొదటిసారిగా ఒంటరిగా ఎన్నికల పోరులో నిలిచేందుకు సైరన్ ఊదింది.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను ఎవరితో జతకట్టేది లేదని తేల్చిచెప్పడం ద్వారా వంద అసెంబ్లీ, పదిహేను ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రకటించింది. దీని కోసం టీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడం ద్వారా స్వీయ రాజకీయ శక్తిగా మలిచి కేంద్రాన్ని శాసించడం ద్వారా తెలంగాణను సాధించాలనే లక్ష్య ప్రకటనకు ఆర్మూర్ ప్రతినిధుల సభ వేదికగా నిలిచింది. గత రెండు ఎన్నికల్లో రాజకీయ పొత్తుల వల్ల జరిగిన నష్టాలను బేరీజు వేసుకుంది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని ఢిల్లీవర్గాల ద్వారా సంకేతం అందిందని చెప్పిన పార్టీ అధినేత ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నియోజకవర్గస్థాయి శిక్షణ శిబిరాలను నిర్వహించి సరికొత్త రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని కేసీఆర్ చెప్పారు. అదే నెలలో బయ్యారం ఉక్కు తరలింపు వ్యవహరంపై భూకంపాన్ని తలపించే ఉద్యమ కార్యాచరణను ఎంచుకుంటామని ప్రకటించారు. ఒక వైపు ఉద్యమ కార్యాచరణ, మరోవైపు రాజకీయ ప్రక్రియను సమాంతరంగా నడుపుతూ పార్టీని ప్రబల రాజకీయ శక్తిగా మలిచేందుకు సరికొత్త దిశను చూపింది ఆర్మూర్‌లో జరిగిన ఆవిర్భావ ప్రతినిధుల మహసభ.

ఏడోసారి అధ్యక్షుడిగా కేసీఆర్

పార్టీ అధ్యక్షుడిగా ఏడోసారి మళ్లీ కేసీఆర్‌నే ప్రతినిధుల మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగానే ప్రతినిధుల మహసభ హర్షధ్వానాల మధ్య ఆమోదం తెలిపింది. అధ్యక్షునిగా ఎన్నికైనట్లు ప్రకటించగానే కేసీఆర్ వేదికపై ఉన్న ఎంపి విజయశాంతితో పాటు పార్టీ ముఖ్య నేతలతో కరచాలనం చేశారు. ఆ వెంటనే వేదికకు కుడివైపున కూర్చొని ఉన్న చిన్నాన్న బాలకిషన్‌రావు, విద్యాబుద్ధులు నేర్పిన గురువు మృత్యుంజయశర్మ దంపతులను కేసీఆర్ శాస్త్రోక్తంగా సన్మానించారు. ఆ ముగ్గురికి సభావేదిక పైనే పాదాభివందనం చేసి శుభాశీస్సులు పొందారు.

హరీశ్‌కు అపూర్వ ఆదరణ…

ఆర్మూర్‌లో జరిగిన ఆవిర్భావ సభ ప్రతినిధుల సభలో హరీశ్‌రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేసీఆర్ వేదికపైకి రాకముందు మొదటగా హరీశ్‌రావు సభావేదిక పైకి రాగానే సభికులంతా కేరింతలు కొట్టారు. ఆ ఉత్సాహంతో హరీశ్‌రావు వేదిక ముందు భాగంలో కలియతిరుగుతూ విక్టరీ సింబల్‌ను చూపుతూ ప్రతినిధులను ఉత్సాహపరిచారు. కేసీఆర్ అధ్యక్షతన మొదలైన ప్రతినిధుల మహాసభలో ఒంటరిగా పోటీ చేయాలనే తీర్మానాన్ని ప్రకటించేందుకు మరోసారి వేదికపైకి హరీశ్‌రాగానే మరోసారి సభ అంతా చప్పట్లతో మారుమోగింది. వెనుక శ్రేణిలో కూర్చున్న నేతలతో మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్ దృష్టి ప్రతినిధుల కేరింతల వైపు మళ్లింది. వడగండ్ల బాధితులను ఆదుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు పోడియం వద్దకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేరుకోగానే సభికులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత ఆయన వేదికపై వెనుక శ్రేణిలో కూర్చున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా కవిత

ఆర్మూర్‌లో జరిగిన ప్రతినిధుల మహాసభ సాక్షిగా కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ ఆరంగేట్రం చేశారు. కరీంనగర్‌లో గతంలో జరిగిన మేధోమథన సదస్సులో పాల్గొన్నప్పటికి పార్టీ బహిరంగ వేదికపైకి ఎక్కడం ఇదే మొదటిసారి.

గులాబీజాతర

గులాబీ జాతరతో ఆర్మూర్ గుబాళించింది. తెలంగాణ నలుమూలల నుంచి వందలాది వాహనాల్లో గులాబీశ్రేణులు తరలిరాగా ఆర్మూర్ గల్లీలు జనంతో కిటకిటలాడాయి. జై తెలంగాణ నినాదాలతో పెర్కిట్, మామిడిపల్లి చౌరస్తాలు దద్దరిల్లాయి. రసమయి బాలకిషన్ నేతృత్వంలో నాలుగు గంటల పాటు నిర్విరామంగా జరిగిన తెలంగాణ ధూం-ధాం సభికులను కట్టిపారేసింది. ఆర్మూర్ చరిత్రలోనే కనీవినిఎరుగని జనజాతరతో జరిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ ప్రతినిధుల సభ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. 40 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభాస్థలి జనంతో నిండిపోగా స్థలం లేక వేలాది మంది ప్రతినిధులు చెట్ల కింద కూర్చున్నారు. ఐదు గంటల పాటు సభా ప్రాంగణం జనంతో కిటకిటలాడటం గమనార్హం. 35వేల మంది ప్రతినిధులకు సరిపడా తెలంగాణ రుచులతో తయారుచేసిన వంటకాలను వడ్డించారు. సభికుల దాహార్తిని తీర్చేందుకు నిర్వాహకులు అంబలి, మజ్జిగ అందచేశారు.

పెరిగిన జోష్..

ఆర్మూర్ గడ్డపై పార్టీ ప్రతినిధుల సభ విజయవంతం కావడం గులాబీశ్రేణుల్లో జోష్‌ను పెంచింది. పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్టీ ఆవిర్భావ సభ నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహించే అవకాశం దక్కడం జిల్లా టీఆర్‌ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. గతంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభల కంటే ఆర్మూర్‌లో హైటెక్ హంగులతో జరగడం పట్ల పార్టీ అధినాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల కు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇక్కడ జరిగిన పార్టీ ఆవిర్భావ సభ ఇందూరు గులాబీ గుడారాంలో ఉత్సాహాన్ని నింపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకే ఇస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఈ గడ్డ నుండే ప్రకటించడం గమనార్హం. స్థానిక పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తామని విధానపరమైన ప్రకటన మొదటిసారిగా ఇక్కడే నుంచే చేయడం మరో విశేషం.

స్థానిక సమస్యలపై నజర్

పార్టీ విధానపరమైన నిర్ణాయక వేదికైన ఆవిర్భావ ప్రతినిధుల సభ జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సైతం దృష్టి పెట్టింది. పదిహేనేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా సింగూర్ జలాలపై ఇందూర్‌కే హక్కును చట్టబద్ధం చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రకటించింది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష చేసిన సందర్భంగా ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన ప్పటికి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఆ హామీనే మరిచింది టీడీపీ. ఆ తర్వాత సింగూర్ జలాలపై హక్కు డిమాండ్‌ను ఏ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చొరవతో సింగూర్ జలాలను పూర్తిగా నిజామాబాద్, మెదక్ జిల్లా ఘన్‌పూర్ రైతాంగానికి హక్కు కల్పిస్తామని టీఆర్‌ఎస్ తీర్మానించడం విశేషం. ఎర్రజొన్న రైతుల బకాయిలను చెల్లించకుండా జాప్యం చేస్తున్న సర్కారుపై ప్రతి నిధుల సభ కన్నెపూరజేసింది. పదిన్నర కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయగా, వైఎస్, కిరణ్ సర్కార్‌లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే పదిలంగా ఉండేందుకు సహకరిస్తున్నారని పార్టీ అధినేతనే ఆరోపించారు. ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *