మంగళవారం రాజ్యసభ ప్రారంభం కాగానే టిఆర్‌ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. దేశంలో పెరుగుతున్న ధరలు, జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చిన పాల ఉత్పత్తుల ధరలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ సభ్యుల చేసిన నిరసనలు, ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. సభా కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడగా… ఆందోళన చేస్తున్న సభ్యులను డిప్యూటీ చైర్మన్ పలుమార్లు వారించారు. అయినప్పటికీ వారు వెనక్కు తగ్గకపోవడంతో టిఆర్‌ఎస్ ఎంపీలను వారం రోజుల పాటు డిప్యూటీ చైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఎంపిలు బడుగులు లింగయ్యయాదవ్, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్రలు ఉన్నారు.
కాగా రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జిఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని విపక్ష పార్టీలతో కలిసి నిరసనకు దిగారు.