mt_logo

ధరలు తగ్గించాలని పదో రోజు కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల ధర్నా

పార్లమెంట్ లో వరుసగా పదో రోజు కూడా టీఆర్ఎస్ సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్, ఇతర ప్రజా సమస్యలపై చర్చ జరపాల్సిందేనంటూ పట్టు వీడకుండా తమ ఆందోళన కొనసాగించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీలు ధర్నాలో ప్ల కార్డులు పట్టుకుని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభలో ప్రజా సమస్యలపై చర్చ జరపాలన్న ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన 50 గంటల నిరవధిక ధర్నాలో టీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది. శుక్రవారంతో ఈ ధర్నా ముగిసిన నేపథ్యంలో జాతీయ మీడియా సైతం దీన్ని ప్రముఖ అంశంగా తీసుకుంది. నిరవధిక ధర్నాలో టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రెండు రోజులు రాత్రంతా ధర్నా శిబిరంలోనే గడిపారు. పార్టీ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి మొక్కవోని లక్ష్యంతో పార్లమెంట్ ఆవరణలో నేలపై నిద్రించి తన నిబద్ధతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు, జీఎస్టీ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా స్వామ్యయుతంగా పార్లమెంట్లో చర్చ జరపాలని కోరిన ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు ఇప్పటికే పార్లమెంట్ లో రెండు వారాలుగా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం తాత్సారం చేసిందని, ఇకనైనా చర్చకు అనుమతి ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , కె.ఆర్. సురేష్ రెడ్డి , వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, దివకొండ దామోదరరావు , బండి పార్థసారథిరెడ్డి , మన్నే శ్రీనివాసరెడ్డి , గడ్డం రంజిత్ రెడ్డి , మాలోత్ కవిత , బొర్లకుంట వెంకటేశ్ నేత , పోతుగంటి రాములు , పనుసూరి దయాకర్ లతో పాటు విపక్ష పార్టీల ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *