దేశంలో మళ్ళీ ఎక్కడా ఉగ్రదాడులు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఉగ్రదాడులు జరక్కుండా చూడాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్లు తెలిపారు. ఉగ్రవాదం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు తెలిపాయని పేర్కొన్నారు.
సీఆర్పీఎఫ్ ఏడీజీ పుల్వామా ఉగ్రదాడి ఘటన వివరాలను అన్ని పార్టీలకు వివరించారని, ఇలాంటి ఘటనలతో ఉగ్రవాదులు భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలను హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో చెప్పారన్నారు. పుల్వామా ఘటనను ఖండిస్తూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు, ఉగ్రవాదాన్ని పూర్తిగా తొలగించాలని ముక్త కంఠంతో స్పష్టం చేశామని ఎంపీ చెప్పారు. ప్రస్తుత ఘటనపై దర్యాప్తు జరుగుతుంది. ఉగ్రవాదుల ఏరివేతకు, జాతి సమైక్యతకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.