mt_logo

టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని, గంగాధర్ గౌడ్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు బుధవారం సాయంత్రం టీఆర్ఎస్ లో చేరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తీగల కృష్ణారెడ్డికి చెందిన టీకేఆర్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో 1700 మురికివాడలు ఉన్నాయని, 17 నుండి 20 లక్షల జనాభా ఆ మురికి వాడల్లోనే నివాసముంటున్నారని, నిరుపేదలకు ఎవరెక్కడ ఉంటే అక్కడే వాళ్లకు పట్టాలిచ్చి క్రమబద్ధీకరిస్తామని, స్థలం సరిపోకపోతే ప్రభుత్వమే వందశాతం ఖర్చుపెట్టి అపార్టుమెంట్లు కట్టి ప్లాట్లు ఇస్తామన్నారు.

హైదరాబాద్ నేనే నిర్మించానని చంద్రబాబు అంటున్నాడు. కులీ కుతుబ్షా ఈ మాట విని ఆత్మహత్య చేసుకోవాలా? హైటెక్ సిటీ నేను కట్టిందే అంటాడు. హైటెక్కో, లోటెక్కో నాకు తెలీదుకానీ గట్టి వాన వస్తే సీఎం ఇంటిముందు, గవర్నర్ ఉండే రాజ్ భవన్, అసెంబ్లీ ముందు మోకాల్లోతు నీళ్ళు నిలబడతాయి. రూ. 10 వేల కోట్లు కన్నా ఎక్కువ ఖర్చయినా హైదరాబాద్ ను మురికివాడలు లేని నగరంగా తయారుచేసి చూపిస్తాం. టర్కీలోని ఇస్తాంబుల్ తరగాలో ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని, చంచల్ గూడలోని జైలును, 170 ఎకరాల్లో ఉన్న రేస్ కోర్సును ఊరిబయట పెట్టి అక్కడ పేదపిల్లల కోసం స్కూళ్ళు కట్టిసామని సీఎం చెప్పారు.

హైదరాబాద్ లో నివసించే గుజరాతీలు, కన్నడీగులు, మలయాళీలు, ఆంధ్రా నుంచి వచ్చిన మిత్రులు అందరూ మా బిడ్డలేనని, చంద్రబాబు మాటలు పట్టుకుని ఆయన్ని నమ్మితే అన్నం కాదు సున్నం పెడతాడన్నారు. చంద్రబాబుకు నీతినిజాయితీ ఉంటే ఏపీలో రైతులకు ఇచ్చినమాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాలని కేసీఆర్ సవాల్ విసిరారు. కరెంట్ ఫ్యూజులు తీసేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బాబు కుట్రలు చేస్తున్నాడని, మాట మార్చే వ్యక్తుల్లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చన్నారు.

కరెంట్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, నాకు నిజాయితీ ఉందని, ఎన్నికల సమయంలో మూడేళ్ళు విద్యుత్ కష్టాలుంటాయని 87 సభల్లో చెప్పానని, మూడేళ్ళు దాటిన తర్వాత రెప్పపాటు సమయం కూడా కరెంటు పోదని హామీ ఇస్తున్నా అని సీఎం హామీ ఇచ్చారు. కేసీఆర్ ఎంత జగమొండో, ఏదైనా పట్టుకుంటే వదలడనే విషయం తెలుసు. అందుకే భవిష్యత్తు మీద భయంతో, ఇప్పుడేదో గోల్ మాల్ చేసి గందరగోళం సృష్టించాలని అనుకుంటున్నారు. వాటిని ఎదుర్కొనే సత్తా మాకు ఉంది. ఒక్క చంద్రబాబు కాదు, లక్ష మంది చంద్రబాబులు వచ్చినా, కోట్లాదిమంది ఆయన తొత్తులొచ్చినా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకుపోతామని, ప్రపంచం ముందు తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *