మాజీ మేయర్, మహేశ్వరం టీడీపీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈరోజు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. బంగారు తెలంగాణ సాధనలో పాలుపంచుకునేందుకు తీగలతో పాటు నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, సరూర్ నగర్ ఎంపీపీ విక్రం రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తీగల సొంత కళాశాల టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభలో వీరంతా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తీగలతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ కీలక నేతలంతా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇదిలావుండగా నవంబర్ 2 న వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన సొంత నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ లో చేరుతానని తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సికింద్రాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో గ్రేటర్ హైదరాబాద్ టీడీపీకి షాక్ తగిలినట్లయింది.