– కేసీఆర్ పర్యటన విజయవంతం
– భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, నేతలు
– సీమాంధ్ర పార్టీలే లక్ష్యంగా విమర్శల వర్షం
– సాగునీటి రంగంలో వివక్ష, దోపిడీపై విసుర్లు
– కార్యకర్తలను ఆకట్టుకున్న కేసీఆర్ ప్రసంగం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమమే కాదు.. స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న గులాబీ అధినేత కేసీఆర్ కోదాడ పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలిరాగా.. జిల్లా, రాష్ట్ర నాయకగణమంతా హాజరయ్యారు. సీమాంధ్ర పార్టీలే లక్ష్యంగా సాగిన కేసీఆర్ ప్రసంగం.. పార్టీ కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది. సాగునీటి రంగంలో తెలంగాణ, జిల్లాకు జరిగిన అన్యాయాలను టీఆర్‌ఎస్ అధినేత ఎండగట్టారు. ఆట, పాట, మాటలతో సమావేశం జోరుగా సాగింది. కేసీఆర్ పర్యటన విజయవంతం కావటంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కోదాడ నియోజకవర్గస్థాయి కార్యకర్తల శిక్షణా శిబిరానికి టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం హాజరయ్యారు. కోదాడ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశానికి జిల్లా, రాష్ట్ర ముఖ్య నాయకులంతా తరలి వచ్చారు. తెలంగాణ ఆట పాటలతో సభా ప్రాంగణం మారుమోగింది. రసమయి బాలకిషన్ ఆట పాట, దేశపతి శ్రీనివాస్ పాట, మాటలు, ఛలోక్తులు, సీమాంధ్ర పార్టీలు, నాయకులపై విమర్శలతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. జై తెలంగాణ, జైజై తెలంగాణ నినాదాలతో శిబిరం దద్దలిల్లింది. కోదాడ పట్టణమంతా గులాబీమయంగా మారిపోయింది.
మధ్యాహ్నమే సూర్యాపేట చేరుకున్న కేసీఆర్.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సాయంత్రం 4.30గంటలకు కోదాడ చేరుకున్న కేసీఆర్‌కు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. జాతీయ రహదారిపై ర్యాలీ, బాణాసంచాలు పేల్చి ఆహ్వానం పలికారు. సుమారు 45నిమిషాల పాటు సాగిన కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం తెలంగాణకు, జిల్లాకు జరిగిన అన్యాయాలను ఎండగడుతూ.. కొనసాగింది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ తవ్వకం సమయంలో కేఎల్‌రావు చేసిన మోసంతో సూర్యాపేట, కోదాడ నియోజకవర్గానికి నీరు రాకుండా అన్యాయం జరిగిందని విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ తవ్వకానికి 45ఏళ్లు అయినా పూర్తి కాలేదని.. ఎలాంటి అనుమతులు లేకుండానే పోతిరెడ్డిపాడును మూడేళ్లలో 400కి.మీ. వైఎస్ తవ్వించారని పోలుస్తూ చెప్పారు. ఎస్సాస్పీ తవ్వినా.. నీరు రాదని, వరంగల్ జిల్లాకే సరిపోదని, ఇదంతా మాయ చేసేందుకేనన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నా.. నీరు రాదని.. లక్షలాది మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారన్నారు. తాను ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో కన్నీళ్లు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని.. అందుకే బోర్లు వేసుకోవాల్సి వస్తోందని కేసీఆర్ తన ప్రసంగంలో జిల్లా రైతుల గురించి ప్రస్తావించారు.
నల్లగొండ మండలం ముషంపల్లికి చెందిన బైర రాంరెడ్డి 54 బోర్లు వేసి బోరు రాంరెడ్డి అయ్యాడన్నారు. ‘అప్పులు చేసి బోర్లు తవ్వారు. భార్య నగలు అమ్మేశారు’ ఎందుకీ గోస అంటూ ప్రశ్నించారు. మోతె, మునగాల మండలాల్లో లిప్టులు పెడతామన్నారు. లక్ష ఎకరాలకు నీరిస్తామని చెప్పినా.. ఒక్క లిప్టు పని చేయటం లేదన్నారు. జూరాల, పాకాల పథకంతో నల్లగొండ జిల్లాలో 15కి.మి కాల్వతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. కోదాడ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమానికి ఉన్న సంబంధాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. 1969లోనే ఈ ప్రాంతంలో అద్భుతంగా ఉద్యమం జరిగింది. కోదాడ గడ్డపై పులిబిడ్డలా జితేందర్‌రెడ్డి పోరాటం చేశాడని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం సీమాంధ్ర పార్టీలను లక్ష్యంగా చేసుకుని సాగింది. నిండు సభలో తెలంగాణకు రూపాయి ఇవ్వనని సీఎం అంటే.. సీమాంధ్ర పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడలేదు. సీమాంధ్ర పార్టీల్లో కీలక పదవులు వారికే. తెలంగాణ ప్రాంత నాయకులు గులాంగిరీ చేస్తూ.. బానిసల్లా ఉంటున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీలకు ఓటు వేయవద్దని.. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పార్టీల జెండా పాతి ఆత్మగౌరవం రెపపలాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమంతో పాటు రాజకీయంగా బలపడితే కేంద్రంలో కీలకంగా మారాలని భావిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలు, సీమాంధ్ర పార్టీల తీరు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ, రాజకీయంగా బలపడే ఆవశ్యకత, భావి తెలంగాణ నిర్మాణం వంటి అంశాలు గ్రామాల్లో వివరించాలని కార్యకర్తలకు పదే పదే సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రాత్మక అవసరమంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.
సమావేశంలో ఎంపీ మందా జగన్నాథం, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుంటకండ్ల జగదీష్‌డ్డి, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు నిరంజన్‌డ్డి, చెరుకు సుధాకర్, కర్నె ప్రభాకర్, కోదాడ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, వేముల వీరేశం, బూర నర్సయ్య, జెల్లా మార్కండేయ, మందుల సామేల్, రాంబాబునాయక్, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)