mt_logo

కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన తెలంగాణ మానసపుత్రిక

కొణతం దిలీప్

6 జూన్ 2011

ఆరోజు లీవ్ పెట్టే పరిస్థితి లేదు ఆఫీసులో. కానీ ఎట్లాగైనా ఆ చారిత్రాత్మక సందర్భాన్ని కండ్లారా చూడాలెనన్న కోరిక నన్ను నిలువనీయలేదు. పొద్దున్నే లేచి మేనేజర్ కు ఎస్సెమ్మెస్ చేసిన. ఏదో అర్జెంటు పని వచ్చిపడింది, ఆఫీసుకు కొంచెం ఆలస్యంగా వస్తానని.

బైక్ మీద రవీంద్రభారతికి పోయేసరికి గేటు వద్ద స్వాగతం పలుకుతూ ఉన్న ఆర్చి మీద “మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ, మన పత్రిక – నమస్తే తెలంగాణ” అన్న అక్షరాలు నన్ను ఉద్వేగానికి గురిచేశాయి.

ఎన్ని దశాబ్దాలైంది ఈ గడ్డకు తనదని చెప్పుకోగలిగే ఒక మానసపుత్రిక లేక… నాలుగు దశాబ్దాల క్రితం బెజవాడ నుండి వచ్చిన పత్రికల ధాటికి తట్టుకోలేక గోల్కొండ పత్రిక మూతపడ్డ తరువాత తెలంగాణ గుండె చప్పుడు వినిపించే దినపత్రికలే కరువయ్యాయి.

తొలి తెలంగాణ పత్రిక “శేద్యచంద్రిక” 1880లల్లోనే పాలమూరు కేంద్రంగా వెలువడ్డా, అనంతరం అనేక పత్రికలు తెలంగాణ గడ్డ మీదనుండి ప్రచురణ అయినప్పటికీ, గోల్కొండ పత్రిక మూతబడ్డ తరువాత నాలుగు దశాబ్దాలకు కానీ మరొక తెలంగాణ దిన పత్రిక వెలుగుచూడలేదు.

పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన సీమాంధ్ర విషపుత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, సూర్య, సాక్షి దినపత్రికలు తెలంగాణ ఆకాంక్షలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్న కాలమది. అప్పటికి మలిదశ ఉద్యమం మొదలై దశాబ్దం దాటినా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి కానీ ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి, మహనీయుల గురించి సరైన సమాచారం ఇచ్చే దినపత్రిక లేని రోజులవి.

మీడియానే సర్వం అయినా ఈ రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్ర సాధన దిశగా నడిపించాలంటే తెలంగాణకు తనదంటూ స్వంతమీడియా ఉండాలనే ఆలోచన కేసీఆర్ కు చాలా రోజుల క్రితమే వచ్చింది. ఈ దిశగా ఆయన కొన్నేళ్ల క్రితం కసరత్తు చేసినా ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. చివరికి మొదలు టి న్యూస్ టీవీ చానెల్ స్థాపించిన ఆయన తదనంతరం దినపత్రిక స్థాపనకు చొరవ తీసుకున్నారు. తన మిత్రుడు, పారిశ్రామికవేత్త సి.ఎల్. రాజం సహాయంతో నమస్తే తెలంగాణ దినపత్రికకు బీజం వేశారాయన.

నమస్తే తెలంగాణ ఆవిష్కరణ సభ ఫోటోలు:

పార్కింగ్ స్థలం అప్పటికే కార్లు, బైకులతో నిండిపోయింది. ఒక మూల బైకును పార్క్ చేసి లోపలికి నడిచాను. హాలంతా కిక్కిరిసి ఉంది అప్పటికే. ముందు వరుసలో ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకులు, వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఎడిటర్లు ఆసీనులై ఉన్నారు. టీ న్యూస్ పీవీ శ్రీనివాస్ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావునీ, టీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెండో వరుసలో అనేక మంది తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు…

మొత్తం తెలంగాణ సమాజంలో ఎన్నదగిన ప్రతి మనిషి అక్కడే ఉన్నట్టుంది.

దేశపతి శ్రీనివాస్ వేదిక మీదికొచ్చిండు. ఆహూతులకు స్వాగతం చెప్పి, ఒక తెలంగాణ ఉద్యమగీతం పాడిండు. వేదిక మీదికి ఒక్కొక్క ప్రముఖుడినీ ఆహ్వానించడం మొదలైంది.

ఐతే ఎవరూ ఊహించని కొందరు అసామాన్య మనుషులు ఆరోజు వేదిక మీదికొచ్చారు. అమరుడు శ్రీకాంతా చారి మాతృమూర్తి శంకరమ్మ, అమరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య భార్య, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన రైతుబిడ్డ ఫనికర మల్లయ్యలను ఆ వేదిక మీద కూర్చోబెట్టి, తెలంగాణ అమరులను, వీరులను తొలిరోజే గౌరవించింది నమస్తే తెలంగాణ బృందం.

అనారోగ్యం శరీరాన్ని కుంగదీస్తున్న మొక్కవోని పట్టుదలగల తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సర్ వేదిక మీదికొస్తుంటే, ఆహూతులంతా గౌరవంగా లేచినిలబడ్డారు.

కేసీఆర్, పత్రిక ఎండీ సి.ఎల్ రాజం, ఎడిటర్ అల్లం నారాయణ, సి.ఇ.ఓ కట్టా శేఖర్ రెడ్డి, వివిధ పత్రికల ఎడిటర్లు ఎన్. వేణుగోపాల్, టంకశాల అశోక్, కె. రామచంద్రమూర్తి, కె స్రీనివాస్ రెడ్డి, వాసు, శైలేశ్ రెడ్డి, జహీరొద్దిన్ అలీఖాన్ లను కూడా వేదిక మీదికి పిలిచారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం అమరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. పత్రిక తొలికాపీని అమరుల కుటుంబాల చేతులమీదుగా ఉదయం 11:45 నిముషాలకు విడుదలచేశారు.

పత్రిక కాపీలు అందుకోవడానికి ఆ హాలులో చిన్నపాటి తొక్కిసలాటే జరిగింది. తమ స్వంత పత్రికను అచ్చులో చూసుకోవాలని అక్కడికొచ్చిన అందరిలో ఆరాటం.

చేతిలోకి కాపీ రాగానే త్వరత్వరగా పేజీలు తిరగేశాను. అద్భుతంగా ఉంది పత్రిక. సీమాంధ్ర పత్రికలకు ధీటుగా ఉన్నది పత్రిక నాణ్యత.

నా ఫోన్ ద్వారా సభ ఫొటోలు, పత్రిక ఫోటోలు తీసి అక్కడినుండే ఫేస్ బుక్కులోకి పోస్ట్ చేశాను. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నాలాగే ఈ పత్రికను చూడాలని ఎంతో ఉత్సాహంగా వేచిచూస్తున్నారని తెలుసు నాకు.

ఆరోజు మొదలైనా నమస్తే తెలంగాణ దినదినప్రవర్ధమానమైంది. ఎన్నో హంగులు సమకూర్చుకుంది. అన్నివర్గాలని ఆకట్టుకునే స్పెషల్ పేజీలను మొదలుపెట్టింది.

పత్రిక ప్రచురణ మొదలైన నాలుగోరోజే శ్రీకృష్ణ కమిటీ రహస్య అధ్యాయన్ని బట్టబయలు చేసి తన సత్తా చాటుకుంది నమస్తే తెలంగాణ.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యంలో మరుగునపడ్డ అనేక అంశాలను కందుకూరి రమేశ్ బాబు సంపాదకత్వంలో వస్తున్న ఆదివారం అనుబంధం బతుకమ్మ వెలికితీస్తోంది. పత్రిక ఎడిట్ పేజీలో తెలంగాణ మేధావులు, చరిత్రకారులు, విద్యావేత్తలు ఆలోచింపజేసే వ్యాసాలను రాస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ కవరేజ్ కు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది నమస్తే తెలంగాణ. తెలంగాణ ప్రజలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉద్యమాల వార్తలను చేరవేస్తూ వారిని ఎల్లప్పుడూ ఉత్సాహపరుస్తుంది ఈ పత్రిక.

అయితే ఇవ్వాళ దినపత్రిక నిర్వహణ అనేది ముళ్లదారిలో నడకలాంటిది. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. అందునా ఒక మాఫియాగా నడుస్తున్న సీమాంధ్ర మీడియాను ఎదిరించి నిలబడటం చిన్నవిషయం కాదు. ఏమాత్రం అవకాశం వచ్చినా నమస్తే తెలంగాణ గొంతునులమడానికి కొన్ని గుంటనక్కలు మాటువేసి ఉన్నాయి. అవి ఈపాటికే అనేకసార్లు ఈ ప్రయత్నాలు కూడా చేశాయి. పత్రికను అమ్మే హాకర్లను, పేపర్ బాయ్స్ ను మేనేజ్ చేసి నమస్తే తెలంగాణ వేయకుండా మరోపత్రిక వేయడం, పత్రిక యాజమాన్యాన్ని రాజకీయాల్లోకి లాగి దుష్ప్రచారం చేయడంతో సహా శత్రువు పన్నని కుయుక్తి లేదు. అయిన్నా వాటన్నిట్నీ అధిగమించి దిగ్విజయంగా రెండేండ్లు పూర్తి చేసుకుంది మన తెలంగాణ మానసపుత్రిక.

ఈనాటికీ సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమంపై అర్థసత్యాలను ప్రచారం చేయడం మానలేదు. తెలంగాణ ఉద్యమం విజయవంతం కావాలంటే ముందుగా తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర మీడియా ఉనికిలేకుండా చేయాలె. దానికొరకు ఉద్యమంలో చురుకుగా ఉన్న వివిధ సంస్థలు, జేయేసీలు, రాజకీయ పార్టీలు నమస్తే తెలంగాణ పత్రికకు విస్తృత ప్రచారం కలిపించాలి. సర్క్యులేషన్ గణనీయంగా పెంచాలె. ప్రతి తెలంగాణ పౌరుడి చేతిలో నమస్తే తెలంగాణ, లేదా ఇంకొక తెలంగాణ పత్రిక మాత్రమే ఉండేటట్లు కృషి చేయాలె.

ఈ రెండో వార్షికోత్సవవేళ నమస్తే తెలంగాణ పత్రిక కలకాలం వర్ధిల్లాలని, ఈ ప్రాంత ఆకాంక్షలకు ఎల్లప్పటికీ అండగా నిలవాలని కోరుకుంటూ, పత్రిక సిబ్బందికి, యాజమాన్యానికి ఉద్యమాభివందనాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *