mt_logo

ఎన్నికల్లో టీఆర్ఎస్ దే ఘన విజయం-కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడానికి ముఖ్య కారణం కేసీఆర్ పోరాటపటిమే అని, కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే అధికారమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించి ఇటీవల మరణించిన విలేకరి నర్సింహులు స్వగ్రామమైన ధారూరు మండలం సర్పన్ పల్లిలో సోమవారం విశ్వేశ్వర్ రెడ్డి పర్యటించారు. పర్యటన సందర్భంగా నర్సింహులు ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మృతుడి తల్లి, భార్య, సోదరుడ్ని ఓదార్చారు. అతడి స్మృత్యర్థం సర్పన్ పల్లిలో గ్రామ సూచిక బోర్డును ప్రారంభించి రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నర్సింహులు మీ మధ్య లేకపోయినా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మదిలో ఉన్నాడన్నారు. అమరుల త్యాగాలు చూసే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వారు ఈరోజు తెలంగాణ తెచ్చింది తామేనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నుండి చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తానని, అందుకు మీ అందరి మద్దతు నాకు ఉండాలని విశ్వేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటుతో పాటు పరిగి, తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన పూర్తి విశ్వాసాన్ని కనపరచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మెతుకు ఆనంద్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ట్రస్టీ రౌతు కనకయ్య, సీనియర్ నేతలు సత్తయ్య, రాందేవ్ రెడ్డి, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా పాల్గొని విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండే వారికే టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, అలాంటి వారికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఎవరు నీతి, నిజాయితీతో పనిచేస్తారో వారికే పార్టీలో స్థానముంటుందని, టిక్కెట్ల కేటాయింపులో కేసీఆర్ దే తుది నిర్ణయమని ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *