mt_logo

ఉద్యోగుల విభజన వివరాలను వెంటనే వెబ్ సైట్లలో పెట్టాలి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై నెలకొన్న సందిగ్ధత తొలగించాలని పలు తెలంగాణ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారుల కమిటీలు ఎలా అనుసరిస్తున్నాయి అనే విషయాలను వెంటనే వెబ్ సైట్లలో ఉంచి సమాచారాన్ని అందించాలని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విభజన ప్రక్రియ మొదలు పెట్టేముందు అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని, ఉద్యోగాల సమస్యే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది వంటిదని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య, ప్రాంతాల వారీగా ఉన్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారి వివరాలను రోజుకోరకంగా ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పనిచేసే ఉద్యోగులను, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా హెచ్‌వోడీలలో పదవి పొందిన ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించి ఏ విధానం పాటించబోతున్నారనే విషయం తెలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 60 ఏళ్లుగా హైదరాబాద్ లో పాతుకుపోయి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందుతున్న సీమాంధ్ర ఉద్యోగులు స్థానికులై పోతుంటే తెలంగాణ జిల్లాల ప్రజలు మాత్రం హైదరాబాద్ లో నాన్ లోకల్ కాటగిరీ కిందకు వస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమంగా సీమాంధ్ర నుండి వచ్చి ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారని, వారంతా రాబోయే తెలంగాణ ప్రభుత్వానికి భారం కానున్నారని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఉద్యోగి జన్మస్థలాన్ని, చదువుకున్న ప్రాంత వివరాలను ఆయా శాఖల వెబ్ సైట్ లో ఉంచాలని, జన్మస్థలం ఆధారంగా రెండు రాష్ట్రాలకూ ఉద్యోగుల పంపిణీ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *