గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డిలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలాఉండగా మేయర్ అభ్యర్ధిగా విజయలక్ష్మి పేరును కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, గాజుల రామారం కార్పొరేటర్ శేషగిరి లు ప్రతిపాదించారు. డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా శ్రీలత రెడ్డి పేరును మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ప్రతిపాదించారు. అనంతరం ఎన్నికల నిర్వహణాధికారి శ్వేతా మహంతి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్ లను ఎన్నుకున్నారు. అనంతరం గద్వాల విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తానని, నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పిస్తానని స్పష్టం చేశారు. మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె పేర్కొన్నారు.