పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కొత్త బిచ్చగాడు. నాలుగుసార్లు ఓడిపోయాడని జాలితో కరీంనగర్ ప్రజలు గెలిపించారు. సంజయ్.. ఇదే నీకు చివరి పదవి.. మొదటి పదవి.. అని హెచ్చరించారు. గంగా జమున తెహజీబ్ గా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టొద్దు. సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా నీకు? తెలంగాణ ప్రజలు కొడితే మానేరు డ్యాంలో పడ్తావ్. నీకు దమ్ముంటే కేంద్రం నుండి నీళ్ళ వాటా తీసుకురా. మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు నిధులు తెచ్చావా? కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు తెచ్చావా? నువ్వు కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమి తెచ్చావో చెప్పగలవా? నిన్ను కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారు. కేవలం మీడియాలో కనపడ్డానికి హైదరాబాద్ మీద, కేసీఆర్ మీద మాట్లాడుతున్నావని మంత్రి ఎద్దేవా చేశారు.
భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మతకలహాలు సృష్టించాలని చూస్తున్నావు. కాంగ్రెస్ బలహీనపడడం వల్ల, మతతత్వం సెంటిమెంట్ తో దేశంలో గెలిచారు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఉద్యమాల నుండి వచ్చారు. కేసీఆర్ గురించి మాట్లాడితే పెద్దవాడివి కాలేవు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కేసీఆర్ అల్లాటప్పా లీడర్ కాదు. తెలంగాణ తెచ్చిన ప్రజానేత. తెలంగాణ కోసం తన ప్రాణాలే ఫణంగా పెట్టి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
కరోనా కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందు పెట్టాల్సి వచ్చింది. ముందు అయితే ముందు అంటారు. వెనుక అయితే వెనుక అంటారు. అయినా మేయర్ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇప్పుడే తొందర ఎందుకు? ఒక వారంలోనే రిజిస్ట్రేషన్ సమస్య తీరుతుంది. ప్రజల కోసమే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాం. రిజిస్ట్రేషన్స్ కూడా బాగున్నాయని ప్రజలు అభినందిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.