తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేకపోవడంతో అన్ని పార్టీల నేతలలో వణుకు ప్రారంభమైందని టీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే అభ్యర్థి హరీష్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలం రామవరంలలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం కేసీఆర్ అంటే జాతీయస్థాయి నాయకులైన నరేంద్రమోడీ, రాహుల్ గాంధీలకు భయం పట్టుకుందని, వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ మానిఫెస్టోను కాపీ కొట్టారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణం చేస్తుందని, మానిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలనూ అమలయ్యేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సెల్ ఫోన్లు, వాచీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ చైనా నుండి దిగుమతి అవుతున్నాయని, అవన్నీ తెలంగాణలోనే తయారుకావాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం మంచిదని, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాయకత్వం కూడా తెలంగాణ వారిదే కావాలని, డిల్లీ నాయకులు, ఆంధ్రా నాయకుల నాయకత్వం మనకు అవసరమా? అని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యిందని, మోడీ నీడలో చంద్రబాబు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నాడని, మోడీకి ఓటు వేస్తే బాబుకు వేసినట్లేనని హెచ్చరించారు.
తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని అంటున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆప్షన్లు ఇస్తారని, తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల పాలన ఉంటుందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, ఇక్కడి ప్రజల సమస్యలు తీరాలంటే రెండు ఓట్లు టీఆర్ఎస్ కే వేయాలని, ఎంపీగా వినోద్ కుమార్ ను, ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను గెలిపించాలని హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.