తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014పై సవరణలు, పర్యవసానాలు’ అన్న అంశంపై శనివారం సాయంత్రం హిమాయత్‌నగర్ లోని చంద్రం బిల్డింగ్‌లో చర్చ జరిగింది. ఈ సమావేశానికి టీపీఎఫ్ నాయకుడు నర్సింహారెడ్డి అధ్యక్షత వహించారు. రాజ్యసభలో బిల్లులో జరిగిన సవరణలన్నీ సీమాంధ్రకే అనుకూలమని, సవరణలపై మాట్లాడితే ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోనని తెలంగాణ నాయకులు ప్రశ్నించే సాహసం చేయలేదని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాదిమంది తెలంగాణ బిడ్డలు అమరులైనా సంపూర్ణ తెలంగాణ దక్కలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షుడు శ్రీధర్‌దేశ్‌పాండే, టీఆర్‌సీ చైర్మన్ వేదకుమార్, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్, మిషన్ తెలంగాణ వెబ్‌సైట్ ప్రతినిధి కొణతం దిలీప్, టీపీఎఫ్ కార్యదర్శి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం జరగడానికి కారణమైన నీళ్ళు, నిధులు, నియామకాలు మూడింటి విషయంలో సవరణల ద్వారా తీవ్ర నష్టం వాటిల్లిందని వివేక్ అన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం, ముంపు ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతానికి కేటాయించడం లాంటివి సంపూర్ణ తెలంగాణకు వ్యతిరేకమని, అన్యాయాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా ఉమ్మడి న్యాయవ్యవస్థ ఏర్పడబోతుందని వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కొణతం దిలీప్ మాట్లాడుతూ, చట్టసభల్లో జరిగిన సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ఏం మాట్లాడితే ఎక్కడ నష్టం వస్తుందోనని తెలంగాణ నాయకులు ఊరుకుండిపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.