mt_logo

ఉభయసభల్లో షిండే, కురియన్ ల సమయస్ఫూర్తి

తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ కురియన్ వ్యవహరించిన తీరుపట్ల సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. సీమాంధ్ర సభ్యులు ఎంత విసిగించినా తట్టుకుని సభను నడిపి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపేలా చేసినందుకు కురియన్ కు సభ్యులేకాక ప్రజలు కూడా అభినందనలు తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం సభ్యులంతా హుందాగా ప్రవర్తించి ఒకరినొకరు కీర్తించుకున్నారు. కురియన్ మాట్లాడుతూ సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అది ఎంతో విలువైనదని అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరిగే సమయంలో సీమాంధ్ర టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఇది పెద్దల సభ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వెంటనే సీమాంధ్ర టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు.
మరోపక్క లోక్ సభలో హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పలువురిపై పొగడ్తలజల్లు కురిపించి అసలైన రాజనీతిజ్ఞుడు అనిపించుకున్నారు. తెలంగాణ బిల్లుకు సహకరించిన అన్ని ప్రతిపక్ష, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షపార్టీ బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ను, లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చి ఉండటం వల్ల వెనక్కు పోకుండా మద్దతు ఇచ్చారని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సహకారం లేకుండా ఏదీ జరగదని షిండే పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన తెలంగాణ బిల్లుపై చర్చను నడిపి ఆమోదం పొందేలా చేసిన స్పీకర్ మీరాకుమార్ ను ఆయన ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *