రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ రంగంలో తెలంగాణకు నేడు విశిష్టమైన దినం అని హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 57 ఏండ్లలో కాలంలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఈ 8 ఏండ్లలో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఆయన బృందానికి, డాక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మెడికల్ రంగంలో కొత్తగా జర్నీని ప్రారంభించబోతున్న విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని, దాంతో పాటు 33 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.