వచ్చే నెల 11న జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. రోడ్ షో సాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, ప్రజలు సహకరించాలని కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ లోని రాంనగర్ చౌరస్తా వద్ద కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతామని, సాయంత్రం 5 గంటలకు రాంనగర్ లో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ గారి ప్రసంగం ఉంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు తెలంగాణ చౌక్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కరీంనగర్ కు ఐటీ టవర్ ను మంజూరు చేసిన కేటీఆర్ కు యువత ఆత్మీయ స్వాగతం పలకాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.