mt_logo

జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టు.. మీకు అందుబాటులో ఉంటా!!

జన్మనిచ్చిన తల్లిమీద ఒట్టుపెట్టి చెప్తున్నా.. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను.. చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు తోడునీడవుతా.. ఆదరించి గెలిపిస్తే మీ సేవకుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తానని చేవెళ్ళ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. గురువారం చేవెళ్ళ నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ఆయన రోడ్ షోలు, ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని పత్తేపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి సింగాపురం శివార్లులోని మణిగార్డెన్ వరకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, పౌరసరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ళ పార్లమెంట్ ఇంచార్జి గట్టు రాంచందర్ రావు, యువనేత కౌశిక్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు.

అనంతరం పరిగి మండలం గడిసింగాపూర్, రంగంపల్లి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తాను అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికే ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఈ ప్రాంతంతో తనకు అవినాభావ సంబంధం ఉందని, తాను రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినేనని అన్నారు. బీ ఫారం తీసుకునేటప్పుడు సీఎం కేసీఆర్ మీకు చెప్పమని కొన్ని మాటలు చెప్పారు.. ఈ ప్రాంతానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ తన మాటగా చెప్పమన్నారని, ఈ పరిధిలో ఉన్న 111 జీవో పూర్తిగా ఎత్తేస్తామని కూడా చెప్పారని రంజిత్ రెడ్డి ప్రజలకు వివరించారు. తనను గెలిపిస్తే శంకర్ పల్లి వరకు ఎంఎంటీఎస్ రైలును తీసుకొస్తానని, సీఎం కేసీఆర్ పాలన చూసి కారు గుర్తుకు ఓటువేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.

ఇదిలాఉండగా గురువారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం, కందుకూరు మండలాల్లో కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఇంచార్జి కొత్త మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కొత్త, పాత నాయకులు సమన్వయంతో పనిచేసి చేవెళ్లలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *