mt_logo

తెలంగాణ చూపు మార్చ్ వైపు

– సెప్టెంబర్ 30కి తెలంగాణ జేఏసీ సన్నాహాలు

– మిలియన్ మార్చ్‌ను తలదన్నేరీతిలో కార్యాచరణ

– గల్లీగల్లీలో భారీగా ఏర్పాట్లు

– సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు జిల్లాల్లో కవాతు

– జోరుగా ప్రచారోద్యమం.. ఉద్యమకారులకు శిక్షణలు

– సెప్టెంబర్ 30లోపే హైదరాబాద్‌కు 50వేల మంది!

నాలుగున్నర కోట్ల ప్రజా గొంతుక.. తెలంగాణ. తరతరాల వివక్షను నిరసిస్తూ ‘మా రాష్ట్రం మాగ్గావాలె’ అంటూ నినదిస్తున్న ఆ పోరుబిడ్డలకు తెలంగాణ జేఏసీ కొత్త నినాదాన్నిచ్చింది..! ఆ నినాదమే.. సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్..!! ఓ వైపు కమిటీలు, భేటీల పేరిట తెలంగాణపై కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ.. మరో వైపు అడుగడుగునా అడ్డుతగులుతున్న సీమాంధ్ర పార్టీల దాష్టీకాన్ని తిప్పికొడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లాయ ర్లు, డాక్టర్లు, విద్యార్థులను కవాతుకు సిద్ధం చేస్తోంది టీ జేఏసీ. సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో చేపట్టనున్న ‘తెలంగాణ మార్చ్’కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం వివిధ రూపాల్లో కొనసాగుతున్నప్పటికీ ‘తెలంగాణ మార్చ్’తో అది పతాక స్థాయికి చేరుకోనుంది. గతంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌ను మించి తెలంగాణ మార్చ్‌ను నిర్వహించేందుకు ఉద్యమకారులు ఏకమవుతున్నారు.

అన్ని శక్తులను కూడగడుతూ..

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లాయర్లు, డాక్టర్లు, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థులు, మైనారిటీలు, ఆదివాసీలు.. ఒక్కరేమిటి అన్ని వర్గాలనూ టీజేఏసీ సమాయత్తపరుస్తోంది. వివిధ రాజకీయ పార్టీలనాయకుల మద్దతును కూడా కూడగడుతోంది. టీజేఏసీలో ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీలు భాగస్వామ్యంతో ఉండగా సీపీఐ బయట నుంచి మద్దతు ప్రకటిస్తోంది. ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ నగారా కూడా తెలంగాణ మార్చ్‌కు మద్దతును తెలిపింది. తెలంగాణ మార్చ్‌ను భారీగా నిర్వహించేందుకు టీజేఏసీ కార్యాచరణను రూపొందించింది. లక్షలాది మందితో తెలంగాణ మార్చ్‌ను నిర్వహించేందుకు సెప్టెంబర్ 30న ‘చలో హైదరాబాద్’ పేరిట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 16 నుంచి వేలాది మందితో కవాతు నిర్వహించేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంది. అంతకుముందు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ రూపాల్లో శిక్షణ తరగతులు, సదస్సులను నిర్వహించనున్నారు. తెలంగాణ మార్చ్ జరిగే సెప్టెంబర్ 30కి కొన్ని రోజుల ముందే సుశిక్షితులైన 50వేల మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా లక్షలాది మంది హైదరాబాద్‌కు చేరుకునే విధంగా వ్యూహాన్ని రచించి, అమలు చేసే కార్యాచరణలో టీజేఏసీ నిమగ్నమైంది.

జోరుగా ప్రచారోద్యమం

ఇప్పటివరకు సాగిన తెలంగాణ ఉద్యమ ప్రధాన ఘట్టాలపై వీడియో డాక్యుమెంటరీని, తెలంగాణ మార్చ్‌పై ప్రత్యేకంగా రూపొందించిన పాటల సీడీలను టీజేఏసీ నేతలు సిద్ధం చేస్తున్నారు. వీటిని అన్ని గ్రామాలకు పంపించనున్నారు. వీడియో డాక్యుమెంటరీలో.. కేసీఆర్ దీక్ష, సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతూ టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంతకంతో కూడిన విజ్ఞాపన పత్రం వంటి తదితర అంశాలు ఉంటాయి. వీటిని ప్రతి తెలంగాణవాది ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వాడవాడలా ప్రచారోద్యమాన్ని కొనసాగింపులో భాగంగా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు టీజేఏసీ మొదటి నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే 80 రోజుల ముందే దీర్ఘకాలిక కార్యక్రమాన్ని ప్రకటించింది. గతంలో మిలియన్ మార్చ్, మానుకోట ఘటనలను అనుభవంలోకి తీసుకొని పకడ్బందీగా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఉద్యమ శ్రేణులన్నింటినీ సమాయత్త పర్చడం కోసం ఈనెల 15 వరకు జిల్లా స్థాయిల్లో స్టీరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించింది. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాలు, మండలాల్లో టీజేఏసీ కమిటీల నిర్మాణాలను పూర్తి చేయనుంది. ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు కార్యకర్తలను, మండల స్థాయిలో కనీసం 20మందిని, నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో రెండు వందల మంది, జిల్లా మొత్తంగా ఐదు వేల మందిని ఎంపిక చేసి సెప్టెంబర్ 15లోగా రోజంతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ మార్చ్‌ను సక్సెస్ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా శిక్షణ ఉంటుంది.

ఆ తర్వాత సెప్టెంబర్ 16 నుంచి జిల్లాకొక రోజు చొప్పున ఐదు వేల మంది సుశిక్షితులైన తెలంగాణవాదులతో జిల్లా కేంద్రంలో కవాతును నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 16న ‘కరీంనగర్ కవాతు’ పేరిట ‘తెలంగాణ మార్చ్-కరీంనగర్ టార్చ్’ నినాదంతో కవాతు ప్రారంభం కానుంది. ఆయా జిల్లాలు స్థానికంగా నిర్ణయాన్ని తీసుకొని కవాతు పేర్లను నిర్ణయించనున్నారు. ఈ కవాతులన్నీ సెప్టెంబర్ 25లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఆయా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి శిక్షణ పొందిన తెలంగాణ ఉద్యమకారులు సుమారు 50వేల మంది సెప్టెంబర్ 30కు ముందుగానే హైదరాబాద్‌కు పాదయాత్రగా చేరుకోనున్నారు. సెప్టెంబర్ నెలంతా తెలంగాణ మార్చ్ సన్నాహక కార్యక్రమాలతో సాగిపోనుంది. అన్ని వర్గాలను సమాయత్త పరిచేవిధంగా సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు, మానవహారాలను నిర్వహించాలని టీజేఏసీ నిర్ణయించింది. టీజేఏసీలోని సంఘాలతోపాటు కొత్తగా ఇతర సంఘాలను కూడా తెలంగాణ మార్చ్‌లో భాగస్వామ్యం చేసేందుకు కసరత్తు సాగుతోంది. రచయితలు, కళాకారులు ప్రత్యేక పాత్రను పోషించనున్నారు. తెలంగాణ మార్చ్‌తో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణకు అడ్డంకిగా మారిన శక్తులకు హెచ్చరిక చేసేందుకు టీజేఏసీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *