తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం, 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ మరికొద్ది నెలల్లోనే ప్రారంభింస్తారని వెల్లడించిన మంత్రి కేటీఆర్… ఈ మూడు మెగా ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు అవుతున్నాయని తెలియజేసారు.
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం 150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వర్క్‌స్టేషన్ ఏర్పాటు, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు. మూడు షిప్ట్‌లలో కలిపి దాదాపు 2 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ పనులు జరుగుతున్నాయి. రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తున్నారు.