తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీ విఠల్ ను సీమాంధ్రకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగసంఘాల నేతలు వారంరోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విషయమై ఉద్యోగసంఘాల నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గురువారం సెక్రటేరియట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి తమ సమస్యలు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడిన తనను సీమాంధ్రకు కేటాయించడం ఏమిటని, ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రాజీనామా చేస్తానని, ఉద్యోగుల హక్కులపై పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సీ విఠల్ ప్రభుత్వ కార్యదర్శి మహంతికి స్పష్టం చేసినట్లు తెలిసింది.
అందుకు స్పందించిన మహంతి ఆందోళన వద్దని, సమస్యను పరిష్కరిస్తానని, రాజీనామా చేయాల్సిన పనిలేదని వారించినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని, ప్రస్తుతం ఉద్యోగుల విభజన తాత్కాలికమని, దీనినే తుది నివేదికగా భావించవద్దని ఆయన చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ లెక్చరర్ల సంఘం, గ్రూప్ వన్ అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల సంఘంతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలన్నిటినీ శుక్రవారం జరిగే చర్చలకు ఆహ్వానించాలని సీఎస్ ను కోరినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు బలవంతంగా పంపితే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీజీవో అధ్యక్షురాలు మమత హెచ్చరించారు. ఉద్యోగుల పంపిణీకి ఏర్పాటు చేసిన కమల్ నాథన్ కమిటీ వ్యవహారం పిచ్చి తుగ్లక్ ను గుర్తు చేస్తుందని తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మండిపడ్డారు.