ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా హైదరాబాద్ నగర పాలక సంస్థ 14 చోట్ల ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల (4వీలర్)ను ఏర్పాటు చేయబోతున్నది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను 20 మెట్రోస్టేషన్లలో ఏర్పాటు చేయగా, తాజాగా జీహెచ్‌ఎంసీ గ్రేటర్‌లో దాదాపు 100 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలి విడతగా టీఎస్ రెడ్కో సాంకేతిక సహకారంతో 14 చోట్ల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కిలోవాట్‌కు రూపాయి చొప్పున చార్జీలు వసూలు చేస్తూ… వచ్చిన ఆదాయాన్ని మూడు నెలలకోసారి టీఎస్ రెడ్కో జీహెచ్‌ఎంసీకి చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రతిపాదనను ఈ నెల 22వ తేదీన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీలో ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్‌ల నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. నగరంలో ఉన్న ఐటీ కంపెనీల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభింది. అదేవిధంగా మెట్రో స్టేషన్లలో కొన్నింటిలో ఇప్పటికే ఈవీ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా ఈవీ చార్జింగ్ అవసరమైన విద్యుత్ సరఫరాను అందించే విద్యుత్ పంపిణీ సంస్థను భాగస్వామ్యం చేయడం ద్వారా మరింతగా ఈవీ చార్జింగ్ సౌకర్యం నగరంలో అందుబాటులోకి రానుంది. ఆయా కార్యాలయాల్లో స్థలాన్ని బట్టి ప్రతి కార్యాలయంలో 4 కంటే ఎక్కువ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ఇవే :
పోర్టం (4 వీలర్స్) కూకట్‌పల్లి,ఎన్‌జీఆర్‌ఐ, ఉప్పల్ స్టేడియం, మెట్టుగూడ, తార్నాక, బేగంపేట, కేపీహెచ్‌బీ, మూసాపేట
పవర్‌గ్రిడ్ కంపెనీ (4 వీలర్స్) మియాపూర్, బాలానగర్
సాబూ కైనెటిక్ (2,3వీలర్స్) దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, కూకట్‌పల్లి
ఈటీవో (2,3వీలర్స్) నాగోల్, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక, పరేడ్ గ్రౌండ్, రసూల్‌పుర, జేఎన్‌టీయూ కాలేజ్, మియాపూర్, పంజాగుట్ట, ఎంజీబీఎస్, అమీర్‌పేట