mt_logo

రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే- హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఏర్పడేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కోరుకుంటున్నారని మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. జగ్గారెడ్డి ఓటర్లను మాయమాటలతో ప్రలోభపెట్టాలని చూస్తున్నాడని, తెలంగాణ ప్రజలంతా విచక్షణతో ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి అన్ని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ జూన్ 2తర్వాత కొత్తరాష్ట్రం ఏర్పడుతుందని, ఆ తర్వాత ప్రజలే పాలకులని, ప్రజాపాలకులు సేవకులుగా ఉంటారని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తుందని, టీడీపీని గెలిపిస్తే గుంటూరుకు దాసోహం చేస్తారని అన్నారు. తెలంగాణ కోసం వేలమంది చనిపోయినా రాష్ట్రం ఇవ్వలేదని, ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రం రాకుండా అడ్డుకున్నది టీడీపీ అని, మొన్న జరిగిన మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు జై సమైక్యాంధ్ర అంటే ఎర్రబెల్లి, రేవూరి ప్రకాష్ రెడ్డి జై కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులైన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా హరీష్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఆంధ్రా పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. వచ్చేవి సంకీర్ణ ప్రభుత్వాలని, తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు తెచ్చే అపర చాణక్యుడు కేసీఆరేనని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తానని చెప్పిన కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *