mt_logo

అనాది నుండి తెలంగాణకు అన్యాయమే-టీ అడ్వకేట్స్ సదస్సు

ఆదివారం హైదరాబాదులోని ఏవీ కాలేజీలో ఉమ్మడి హైకోర్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ పది జిల్లాలకు చెందిన అడ్వకేట్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని, కొత్త రాష్ట్రం ఏర్పాటులో అసెంబ్లీకి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేశారు. రాజ్యాంగం గురించి పూర్తిగా తెలియకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పిన వారు బిల్లు ప్రతులను చింపి, కాల్చివేయడం ద్వారా రాజ్యాంగ ధిక్కారం చేశారన్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించి న్యాయవాదుల సభకు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలలో పాల్గొనే న్యాయవాదులపై ఆంక్షలు విధించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ సీవీ రాములు మాట్లాడుతూ, ఉమ్మడి హైకోర్టు వద్దని, మొదటి నుండీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందనీ, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండకుండా సీమాంధ్ర కుట్రదారులు పన్నాగం పన్నుతున్నారని అన్నారు.

ఉద్యోగ నియామకాలకు సంబంధించి జడ్జిల, కోర్టు మినిస్ట్రీయల్ సిబ్బంది విషయంలో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని, అందుకే ఉమ్మడి హైకోర్టు ప్రణాళిక బిల్లులో ప్రవేశబెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో లాయర్ల పోరాటం మరువలేనిదని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. కోర్టుల్లో టీ న్యాయవాదులు అసలైన యుద్ధం చేశారన్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ ప్రాంతానిదేనని, సీమాంధ్ర ప్రాంతానికి రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేకంగా మరో కోర్టును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోదండరాం స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ బీ. వినోద్, సీనియర్ న్యాయవాదులు, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *