మంత్రి శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించడంపై కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం నాడు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా మాట్లాడారు. జనవరి 23 అర్ధరాత్రి దాటిందంటే విభజన బిల్లు అసెంబ్లీ పరిధులు దాటి పోతుందని, ఆ తర్వాత ఏమి చేసినా ఉపయోగం లేదని, సీమాంధ్ర నేతలను హెచ్చరించారు. ఫిబ్రవరి మొదటివారంలో జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం కోసం పంపబడుతుందని, ఈలోగా తెలంగాణను అడ్డుకోవడానికి కోతిచేష్టలు చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.
బిల్లు తుదిదశకు చేరుకుంటున్న సమయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని యావత్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు విషయంలో అధికార దుర్వినియోగం చేశారని, ఎవరెన్ని వేషాలు వేసినా జనవరి 23 వరకేనన్నారు. ‘కేంద్ర కేబినెట్ ఆమోదంతో జీవోఎం ఏర్పడినరోజునుంచే విభజన ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగపరమైన కాలచక్రం ప్రారంభమైంది. ఈ కాల చక్రాన్ని ఆపడం సీఎంతో సహా ఎవరివల్లా కాదని, అడ్డుకుంటే కాలచక్రం కింద పడి నలిగిపోతారు.’ అని వ్యాఖ్యానించారు. టీ బిల్లులో ఏమైనా లోపాలుంటే అసెంబ్లీ చర్చలో చెప్పాలని, అలా కాకుండా చర్చకు అడ్డుపడితే నష్టపోయేది మీరేనని సీమాంధ్ర ప్రతినిధులను హెచ్చరించారు. వేరే రాష్ట్రాల ఏర్పాటు విషయంలోనూ పార్లమెంటుదే తుది నిర్ణయమని, అసెంబ్లీకి ఏ నిర్ణయాధికారాలు లేవన్నారు.
సీమాంధ్రులుచేసే కుట్రలను తిప్పికొట్టాలని, వారు తెలంగాణ అడ్డుకోవడానికి అనేక ఎత్తుగడలు వేస్తారని, వాటి ఉచ్చులో పడొద్దని తెలంగాణ ప్రజలను ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. బిల్లును తాము డిల్లీలో వేయి కళ్ళతో కాపాడుకుంటామని, ఎలాంటి ఉపద్రవం జరగనివ్వమని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు.