mt_logo

మాతృభాషల్లోనే వాచకాలు!

గిరిజన తెగల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రాథమిక విద్యను తమ తెగలకు సంబంధించిన భాషల్లోనే చదువుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,426 గిరిజన పాఠశాలలు నెలకొల్పి 2020-21 విద్యాసంవత్సరానికి గానూ వాచకాలను రూపొందించింది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సూచన ప్రకారం గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింధి. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొలామి వాచకం, గోండి వాచకం, బంజార వాచకం, కోయ వాచకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ వాచకం ద్వారా ఒకటో తరగతిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాలను ఒకటవ పాఠంలో పునశ్చరణ చేసి మిగతా పాఠాల్లో విద్యార్థి పఠన, లేఖన, శ్రవణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన గిరిజన అంశాలను ఎంచుకుని రూపొందించారు. ఈ విధంగా చేస్తే మాతృభాషలో బోధన చేస్తే విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారని, పాఠశాలల్లో డ్రాపౌట్స్ కూడా తగ్గుతాయని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఇదిలా ఉండగా 2019-20 లోనే బంజారా, కోయ, గోండి, కొలామి భాషల్లో చిన్న చిన్న పదాలతో పుస్తకాలను రూపొందించి ఆయా పాఠ్య పుస్తకాలతో పాటు తమ భాషకు సంబందించిన పదాలను నేర్చుకునేలా రూపొందించారు. ఈ విద్యాసంవత్సరంలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు గిరిజన భాషల్లో వాచకాలను ప్రవేశపెట్టారు. గిరిజన భాషలోని పాఠాలను ఉపాధ్యాయులు తెలుగు భాషలో చెప్పేందుకు అనుకూలంగా ప్రతి గిరిజన భాషా వాచకం వెనుక భాగంలో తెలుగులో పాఠాలను క్లుప్తంగా రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *