mt_logo

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని కొండకల్ వద్ద రూ. 800 కోట్ల వ్యయంతో, 100 ఎకరాల్లో చేపట్టిన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అని అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారా? ఈ ప్రాంతంలో ఉన్న పెట్టుబడిదారులు అందరూ వేరే ప్రాంతానికి పోతారు తప్ప తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు!! అనే ఒక భయోత్పాతమైన వాతావరణం. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య 6 ఏండ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ ఆరేండ్లలో చాలా గర్వంగా, సంతోషంగా చెప్పుకునే అనేక పరిణామాలు పారిశ్రామిక రంగంలో సాధించాం. ఒక తెలంగాణ బిడ్డ యుగందర్ రెడ్డి గారు స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడి నుండి రావడం మనకందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణమే జరగడంలేదు.. ఆదిభట్లలో విమానాలు, విమానాల పరికరాలు తయారవుతున్నాయి. బోయింగ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు.. బోయింగ్ తయారు చేసే విమానాలు, అలాగే అపాచీ హెలికాప్టర్లు, వాటికి సంబంధించిన ముడిపరికరాలు ఈరోజు తెలంగాణలోనే తయారవుతున్నాయి. మరొకవైపు జహీరాబాద్ లో ట్రాక్టర్లు తయారవుతున్నాయి. బస్సులు కూడా తయారవుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు వరకు రైల్వే కోచ్ లేని లోటు ఇప్పుడు మేధా సంస్థ ద్వారా తీరుతుందని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన సందర్భంగా ఆరు ఏండ్ల కిందట కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ రోజు వరకూ అతీగతీ లేదని మండిపడ్డారు. భవిష్యత్తులో గంటకు 160 కి.మీ. వాయువేగంతో నడిచే రైళ్ల ప్రాముఖ్యత ఉందని, హైద్రాబాద్ నుండి ఏ ప్రాంతానికైనా అతి తక్కువ సమయంలో వెళ్ళేలా హై స్పీడ్ రైళ్లు వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు జెడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *