ఆదివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం నిర్మాణానికి విద్యుత్ శాఖామంత్రి లక్ష్మారెడ్డి ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వచ్చే మూడేళ్ళలో రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను రెండు, మూడేళ్ళలో అధిగమిస్తామని స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు పునరుత్పాదక ఇంధనకేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణ అనువైనదని, రెండు నెలల క్రితం 500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి టెండర్లను ఆహ్వానిస్తే 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బిడ్లు దాఖలయ్యాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 30 లక్షల ప్రభుత్వ భూమిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వివిధ రంగాలకు చెందిన సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు.
అనంతరం టెరి డైరెక్టర్ జనరల్ ఆర్కే పచౌరీ మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన కేంద్రంగా నిలిచేందుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, టెరికి హైదరాబాద్ లో మరో క్యాంపస్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెరి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ లీనా శ్రీవాత్సవ్, కార్యదర్శి ఎస్ కే జోషి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, ఐఎస్ బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తదితరులు పాల్గొన్నారు.