mt_logo

తేలిన ఇంజినీ’రంగు’

-అక్రమాల గబ్బు కొడుతున్న కాలేజీలు..
-నాణ్యమైన ఇంజినీరింగ్ బోధన సున్నా
-అనేక కాలేజీల్లో కనీస ప్రమాణాలు గగనమే..
-బోధన ఫీజుల కోసమే ఏర్పాటు..
-ఫీజుల ఉద్యమం వెనుక ఎమ్మెల్యే హస్తం!
– బోగస్‌గా తయారైన రీయింబర్స్‌మెంట్
– వాస్తవ లబ్ధిదారులు పదిశాతం లోపే!
– విద్యార్థుల పేరుతో యాజమాన్యాల సోకు
– తేల్చి చెప్తున్న టాస్క్‌ఫోర్స్ నివేదికలు
ఇప్పుడు అత్యధిక లాభాలు సంపాదించిపెట్టే వ్యాపారం ఏదైనా ఉందంటే.. అది విద్యావ్యాపారమే! అందుకే గత ప్రభుత్వ స్వార్థ నిర్ణయాల పుణ్యమాని ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సేవా సంస్థలు సైతం కాలేజీలు నిర్వహించాయి. కొందరు అప్పటిదాకా ఈగలు తోలుకున్న కాలేజీలకు సర్కారీ సొమ్ముతో రంగులేసుకున్నారు.

కోళ్లఫారాలనో, రేకుల షెడ్డునో కాలేజీగా మార్చేయడం.. ఏఐసీటీఈలో చక్రం తిప్పే నేతలను పట్టుకుని అనుమతులు తెచ్చుకోవడం.. ఇంటింటికీ తిరిగి విద్యార్థులను కాలేజీలో చేర్పించుకోవడం.. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ తెప్పించుకుని దందా నడిపేయడం! నామమాత్రపు పెట్టుబడితో ఘనమైన లాభాలు! ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీగా గండి! పోనీ విద్యార్థులకు తగిన పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్నారా? అంటే అదీ లేదు.

685 కాలేజీల్లోనూ ఫ్యాకల్టీల విషయంలో ఏఐసీటీఈ ప్రమాణాలు పాటించడం లేదని గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ నివేదికలే తేల్చాయి. నిపుణులైన అధ్యాపకులతో విద్యాబోధన చేయాల్సిన కాలేజీలు.. బీటెక్ సీనియర్ విద్యార్థులతోనే పాఠాలు చెప్పిస్తూ ఆ మేరకు వేతనాలను తమ ఖాతాలో వేసుకుంటున్నాయని ట్యూషన్ ఫీజుల నిర్ధారణకు ముందు జరిపిన తనిఖీల్లోనే వెల్లడైంది. అనేక ఉదంతాలు గమనిస్తే కేవలం సర్కారీ ఫీజుల కోసమే ఈ కాలేజీలు పుట్టుకొచ్చాయని తేలిపోయింది. వెరసి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు అవినీతి గబ్బుకొడుతున్నాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ఒక బోగస్ పథకమని తెలంగాణ మేధావులు అనేక మంది కుండబద్దలు కొట్టిమరీ చెప్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న విద్యార్థులు పదిశాతం కూడా లేరని సాంకేతిక విద్యాశాఖ అధికారుల అభిప్రాయం. విద్యార్థులకు సాయపడాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అనేక లొసుగుల కారణంగా యాజమాన్యాల అవసరాలు తీర్చేదిగా తయారైందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. కానీ.. ఒక ఎమ్మెల్యే మాత్రం ఈ వాస్తవాలన్నింటినీ పక్కనపెట్టేసి.. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కోసం ఉద్యమాలు చేస్తుండటంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

లాభాపేక్షే తప్ప సత్సంకల్పం లేదు..
కేవలం లాభాపేక్షతో విద్యావ్యాపారం ప్రారంభించిన అనేక ఇంజినీరింగ్ కాలేజీలలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించిన కనీస ప్రమాణాలు పాటించిన దాఖలు కనిపించటం లేదు. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ట్యూషన్ ఫీజుల నిర్ధారణకు ముందు అన్ని కాలేజీలను తనిఖీ చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు వేశారు.

దశలవారీగా మొత్తం 685 కాలేజీలలోనూ తనిఖీలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కాలేజీలలో ఏఐసీటీఈకి సంబంధించి ఏ ఒక్క నిబంధననూ చాలా యాజమాన్యాలు పాటించలేదని టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లోవెల్లడైంది. ప్రతి కాలేజీ నుంచి నాణ్యమైన విద్య అందాలంటే సమర్థులైన అధ్యాపకులను నియమించుకోవాలి. ఇలాంటి నిబంధనలను తుంగలో తొక్కి బీటెక్ సీనియర్ల విద్యార్థులతోనే జూనియర్‌లకు తరగతులు బోధిస్తున్న ఉదంతాలు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్ నివేదికలు స్పష్టం చేశాయి.

నిబంధనల ప్రకారం 1:2:6 నిష్పత్తిలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగాలి. దీని ప్రకారం ఇప్పుడున్న 654 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల కోసం 8,398 మంది ప్రొఫెసర్లు అవసరం. కాని పీహెచ్‌డీ అర్హత సాధించిన ప్రొఫెసర్లు కేవలం 2,182 మంది మాత్రమే ఉన్నారు. 16,796 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల అవసరం ఉండగా కేవలం 4789 మంది మాత్రమే ఉన్నారు. 50,391 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకుగాను ప్రస్తుతం 32,833 మంది మాత్రమే బోధన జరుపుతున్నారు.

ఏఐసీటీఈ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా పీహెచ్‌డీ అర్హత లేకపోయినప్పటికీ ప్రొఫెసర్లుగా కొనసాగుతున్న వారు అన్ని కాలేజీలలో కలిపి 532 మంది ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ నివేదికలు కుండబద్దలు కొట్టాయి. 15,233 మంది అధ్యాపకులు బీఈ/బీటెక్ అర్హతతో కొనసాగుతున్నారు. 122 కాలేజీలలో 50 శాతానికి పైగా బీఈ/బీటెక్ అర్హతతో కొనసాగుతున్న అధ్యాపకులు ఉన్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ఫ్యాకల్టీ ప్రమాణాలు పాటించక పోవడం వల్ల ఆయా ఇంజినీరింగ్ కాలేజీల నుంచి బయటకు వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నాణ్యత తగ్గిపోతున్నది.

వారు ఇంజినీర్లుగా కాదు.. కనీసం కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా కూడా పనికిరాకుండా పోతున్న సందర్భాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అన్ని కాలేజీలలో ఇప్పటి వరకు అర్హులైన ఫ్యాకల్టీకి సంబంధించి 2,666 మంది ప్రొఫెసర్లు, 32,285 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో 17 కాలేజీలలో ఐదో వేతన కమీషన్ పేస్కేళ్ళను అమలు పరుస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ నివేదికల ప్రకారం 561 ప్రైవేటు కాలేజీలలో 90 శాతం అధ్యాపకులకు పే స్కేళ్ళు అమలు చేయడం లేదు. ప్రతి నెల వారికి గుండుగుత్తగానే జీతాలు చెల్లిస్తున్నారు. కనిష్ఠంగా రూ.8000 నుంచి గరిష్ఠంగా రూ.65,000 వరకు చెల్లిస్తున్నారు.

చాలా ప్రైవేటు కాలేజీలు గెస్ట్ లెక్చరర్లను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ వారిని రెగ్యులర్ ఫ్యాకల్టీగానే చూపిస్తున్నారని టాస్క్‌ఫోర్స్ తేల్చింది. పైగా వారికి పూర్తి స్థాయిలో పే స్కేళ్ళు అమలు పరుస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. మరికొన్ని కాలేజీలలో యూనివర్సిటీ/రీసెర్చ్ సంస్థలు/ పబ్లిక్ సెక్టార్‌లలో పని చేసి పదవీ విరమణ పొందిన వారితో పాఠాలు బోధిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటివారు 60 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్కులై ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. 593 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో పని చేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బందికి కేవలం గుండు గుత్త జీతాలను చెల్లిస్తున్నారు.

కనీస వసతులు కరువు
రాష్ట్రంలో అన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో కనీస వసతి సదుపాయాలు లేవని టాస్క్‌ఫోర్స్ నివేదికలను బట్టి తెలుస్తున్నది. రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా టాస్క్‌ఫోర్స్ నివేదికల్లో పొందుపరిచిన అంశాల ప్రకారం.. 0.40 శాతం నుంచి 60 శాతం వరకు ప్రమాణాలు పాటించని కాలేజీలు అనేకం ఉన్నాయి. 319 కాలేజీలలో భూమి, కావాల్సినంత నిర్మిత స్థలం లేదు. 393 కాలేజీలలో నిబంధనల ప్రకారం కంప్యూటర్లు ఏర్పాటు చేయలేదు. 449 కాలేజీలలో లాబొరేటరీలు తగినట్లుగా లేవు. 565 కాలేజీలలో పరిశోధనలకు సంబంధించిన పరికరాలు లేవు. 146 కాలేజీలలో ఇంజినీరింగ్ విద్యా బోధనకు కావాల్సిన పుస్తకాల లభ్యత లేదు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విషయానికొస్తే.. 421 ప్రైవేటు కాలేజీలలో 265 కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్లు నిర్వహించగా కేవలం 17,652 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని టాస్క్‌ఫోర్స్ నివేదికలో పొందుపరిచారు.

దొడ్డి దారిలో అడ్మిషన్లు..
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు దొంగ వ్యాపారానికి దారులు వెతికాయి. యాజమాన్య కోటా ప్రకారం 30% సీట్లు సొంతంగా భర్తీ చేసుకునే వెసులుబాటు ఆయా కాలేజీలకు ఉన్నప్పటికీ వాటి జోలికిపోలేదు. ఆ కోటాలో సీట్లకూ ఫీజులు దక్కించుకున్నాయి. మెరిట్ పద్ధతిలో యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేయాలన్న నిబంధనలు ఉన్నా.. వాటినీ బుట్ట దాఖలు చేశారు. విచ్చలవిడిగా డోనేషన్లకోసం విద్యార్థుల ముక్కు పిండుతున్నారు.

ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల వరకు డోనేషన్లు వసూలు చేస్తున్న కాలేజీలు రెండు రాష్ట్రాలలో పుష్కలంగా ఉన్నాయి. ఏ గ్రేడ్ కాలేజీలలో సీటు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా పలుకుతుంది. బీ గ్రేడ్ కాలేజీలలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంది. సీ గ్రేడ్ కాలేజీలలో ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు, డీ గ్రేడ్ కాలేజీల్లో ఐదు లక్షల రూపాయల వరకు డోనేషన్లు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా.. స్పెషల్ ఫీజులు, ఆ ఫీజులు, ఈ ఫీజుల పేరుతో ఒక్కొక్క విద్యార్థిపైన మరో లక్ష రూపాయల వరకు ఆర్థిక భారం వేస్తారు. మైనార్టీ కాలేజీల్లో 70 శాతం సీట్లను మైనార్టీ విద్యార్థులతోనే భర్తీ చేయాలి. కానీ నాన్ మైనార్టీ పిల్లలతోనే సీట్లు భర్తీ చేస్తున్నారు. అలాంటి కాలేజీలు దాదాపు 200 పైగా ఉంటాయని టాస్క్‌ఫోర్స్ లెక్కలు వివరిస్తున్నాయి.

రీయింబర్స్‌మెంట్ కోసమే 350 కాలేజీలు
కన్వీనర్ ద్వారా భర్తీ అయ్యే సీట్లకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందని గత ప్రభుత్వం ప్రకటించడంతో ఇందులో అనేక అక్రమాలకు తెరలేచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో పేదలకు ప్రభుత్వమే ఫీజులు భరించడంతో కొన్ని కాలేజీలు వారికి ఇష్టం ఉన్నా, లేకపోయినా బలవంతంగా అడ్మిషన్లు ఇస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రతి కాలేజీకి, ప్రతి ఇంటికి పీఆర్‌వో వెళ్ళి, వారి మైండ్‌సెట్ మార్చుతున్నారు. ఈ విధంగా కేవలం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం కోసం 350 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు కొత్తగా పుట్టుకొచ్చాయని సాంకేతిక విద్యాశాఖ అధికారులు అనేకసార్లు స్పష్టం చేశారు. సదరు కళాశాలల్లో కేవలం 36.04 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదవుతుండటం గమనార్హం.

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏటా రూ.3000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ఉత్తీర్ణత శాతం అతి తక్కువగా నమోదవుతున్నది. దీనిని బట్టి చూస్తే ఫీజుల కోసమే తప్ప నాణ్యమైన విద్యను అందించాలన్న ఆలోచన ఇంజినీరింగ్ కాలేజీలకు లేదన్న విషయం స్పష్టమయిందని టాస్క్‌ఫోర్స్ నివేదికల ద్వారా అధికారులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఆట కట్టించాల్సిందే
వీటన్నింటినీ గమనిస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక బోగస్ పథకం అంటున్న మేధావుల మాట నిజమని రుజువవుతున్నది. ఈ పరిస్థితుల్లో విద్యావ్యాపారం కోసమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడిన కాలేజీ యాజమాన్యాల ఆట కట్టించాల్సిన తరుణం ఆసన్నమైందని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. ఏ పథకమైనా వాస్తవ లబ్ధిదారుడికి చేరితేనే ఉపయోగం.

పెనుభారంగా ఉన్న రీయింబర్స్‌మెంట్ పథకంలో మరో ఇబ్బందికర అంశం తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులు. వారి సంఖ్య 1.15 లక్షల మంది వరకూ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ కూడా ఫీజులు చెల్లించాలంటే తెలంగాణ ఖజానాపై అధిక భారం పడుతుంది. అయినా పక్క రాష్ట్రం వారికి మన రాష్ట్రం ఫీజులు కట్టడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నది.

ఫీజుల బకాయిలు ఇప్పటి వరకు రూ.1300 కోట్లు ఉన్నాయి. ఒక వేళ కాలేజీలను బలోపేతం చేస్తే రూ.4000 వేల కోట్ల నుంచి రూ.5000 కోట్ల మేరకు భారం పడే అవకాశాలు ఉన్నాయి. అదే ఏ రాష్ట్రం పిల్లలకు ఆ రాష్ట్రమే ఫీజులు భరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల భారం రూ.3000 కోట్లకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మిగులును విద్యుత్ కొనుగోళ్లకు, ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చిస్తే రాష్ట్రం అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *