mt_logo

తెలంగాణోల్లకేం తెలుసు?

సీమాంధ్రలో జరుగుతున్న ఏకపక్ష ఉద్యమంపై ఒక సీమాంధ్ర మిత్రుడి వ్యంగ్య రచన!

ఇవాళ ఆంధ్రప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో ఉద్యమ బాటపట్టిన వాళ్లం మేము.. అంతా కలిసికట్టుగా, సమైక్యంగా ఒకే గొంతుతో ఒకే నినాదం చేస్తున్నాం.. తమతో విడిపోతామని ఆందోళన చేస్తున్న తెలంగాణ వాసులు మాతోనే కలిసి ఉండాలని నినదిస్తున్నాం.. మీకు ఇష్టం ఉన్నా, లేకపోయినా మాతోనే కలిసి ఉండాలని హెచ్చరిస్తున్నాం.. విడిపోతే మీరు అభివృద్ధి సాధించటం కష్టం.. మేము లేకపోతే మీకు రాళ్లూ రప్పలే దిక్కని భవిష్యత్తును చూపిస్తున్నాం…

మా అభిప్రాయమే మీ అభిప్రాయం.. మీకంటూ ఓ అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.. మీ మంచి గురించి కూడా మేమే ఆలోచిస్తున్నప్పుడు.. మీ అభివృద్ధి బాధ్యత కూడా మేమే తలకెత్తుకున్నప్పుడు మీకెందుకు చింత….. సమైక్యం కావాలా వద్దా అని మిమ్మల్ని అడగాల్సిన పని లేదు.. మీరెట్లా ఉంటే బాగుంటారో, ఎలా ఉండాలో, ఎలా ఉంచాలో మాకు తెలిసినప్పుడు.. ఇక మిమ్మల్ని అడగడం దేనికి.. సమైక్యం కావాలని మేమడిగితే చాలు.. మీతో పనేం లేదు.. మీరు కూడా సమైక్యమే కోరుకుంటున్నారనీ మేమే నిర్ధారించాం..

మీరు వేలిముద్రగాళ్లు.. చదువు సంధ్య, నాగరికత లేని వాళ్లు.. సంస్కృతిక వైభవానికి దూరంగా ఉన్నవాళ్లు మీకేం కావాలో మీకే తెలియదు..అసలు ఆవకాయ ఎలా తినాలో కూడా మేము నేర్పాం మీకు… మీకంటూ తిండి తినటం కూడా రాని వాళ్లను మేము పైకి తీసుకువచ్చాం.. అలాంటి మాకు వ్యతిరేకంగా, మా పట్ల కృతజ్ఞత లేకుండా కెసిఆర్‌ అనే ఒకానొక మూర్ఖుడు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నాడు..

మిమ్మల్ని ఉద్ధరించటానికి ఎక్కడో సుదూర ఆంధ్రప్రాంతం నుంచి వచ్చినవాళ్లం మేముండగా మీరు దేని గురించీ ఆలోచించాల్సిన పని లేదు.. మాట్లాడాల్సిన అవసరం లేదు.. మీ తరపున కూడా మేమే మాట్లాడతాం.. మేమే నిర్ణయాలు తీసుకుంటాం. విడిపోవాలని కోరుకునే హక్కు మీకు లేదు.. ఎలా బతకాలో ఎలాంటి బట్టలు కట్టుకోవాలో… ఏం తినాలో మీ అంతట మీరు నిర్ణయించుకో వీల్లేదు.. మీకేం తెలియదు.. మేం ఏం చెప్తే అది చేయండి.. ఏం కట్టుకోమంటే అది కట్టుకోండి.. ఏం తినమంటే అది తినండి.. మీరు మైనారిటీలు.. మీకు అభిప్రాయం ఉండకూడదు.. ప్రజాభీష్టం అంటే మేము చెప్పేదే..ప్రజలంటే మేమే… పొరపాటున కూడా మిమ్మల్ని మీరు ప్రజలుగా భావించుకోకండి… మేము చెప్పిందే వేదం.. మేము చేసిందే శాసనం.. మేము చూపిందే అభివృద్ధి అంటారు..

ఎవరితో సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామో.. వారి ప్రమేయం లేకుండా.. వారితో సంబంధం లేకుండా, వారి అవసరం లేకుండా.. వారితో మాట్లాడకుండా, వారి ప్రాంతంలోకి వెళ్లకుండా వారికి బహు దూరంగా, ఉంటూ. మనం అన్నదమ్ములం.. విడిచిపెట్టావంటేనా .. జాగ్రత్త… అసలు మీరెవ్వరు విడిపోవటానికి…మీరు ఉండాలో, విడిపోవాలో మేము చెప్పాలి.. మీరెట్లా బతకాలో మేము శాసించాలి.. విడిపోతామంటూ 1000 మంది చచ్చిపోతే మాకేంటి…వాళ్ల ప్రాణాలకు కూడా విలువ కట్టడం మూర్ఖత్వం కాదా.. ! ఇదిగో మా దగ్గర మీడియాలో వార్తలు చూస్తూ గుండెలు పగులుతున్నాయి.. అయ్యో.. అదీ మీకోసం, మీతో కలిసి ఉండటం కోసం.. ఏం తమాషా చేస్తున్నారా? కలిసి ఉండండి.. మీరు ఎంత గింజుకున్నా మిమ్మల్ని విడిపోనిచ్చేది లేదు.. ససేమిరా లేదు.. మీ భూమిలో, మా అధికారంలో మీరు బతుకులు వెళ్లదీయాలి. మీరు జాగో అన్నా.. భాగో అన్నా మేం పోయేది లేదు.. మీదొక భాష… అదొక యాస… ఆ మాట కూడా మాటేనా?

మాట్లాడితే అభివృద్ధి అంటారు.. వెనుకబడ్డాం అంటారు.. ఏం వెనుకబడ్డారు. రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేస్తే.. తెలంగాణలోని పది జిల్లాలూ అభివృద్ధి చేసినట్లే…ఎక్కువ మాట్లాడకండి.. రాజధాని మీ జిల్లాల మధ్యలోనే ఉంది. అది అభివృద్ధి జరిగితే మీ జిల్లాలన్నీ అభివృద్ధి జరిగినట్లే.. అదొక్కటి చాలదా మీ మొహానికి.. చూపెట్టుకోవటానికి.

మీరు ఫ్లోరోసిస్‌తో చచ్చిపోతే మాకేం… ఆకలి చావులకు ఆహుతైతే మాకేం… గల్ఫుకు వెళ్లి 30 వేల మంది జైళ్లలో మగ్గితే మాకేం… పోనీ రాజధాని అయినా అభివృద్ధి చేశారని సంతోషపడదామనుకుంటున్నారా? మీకంత సీనేం లేదు.. మీ ఊళ్ల మధ్యన ఉన్నంత మాత్రాన రాష్ట్ర రాజధాని మీ సొత్తు కాదు.. అది మాది.. ముమ్మాటికీ మాదే.. మేము కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన మహానగరం అది…

తొక్కల నిజాం కట్టిన పాడుబడ్డ బిల్డింగులు చూపి… అండర్‌డ్రైనేజీ చూపి ఆహో.. ఓహో అంటే చాలదు.. మా ఇళ్లు చూడండి.. మా అపార్ట్మెంట్లు చూడండి..మా వ్యాపారాలు చూడండి.. మా సినిమా స్టూడియోల ముందు వచ్చి పడిగాపులు కాయండి…ఎయిర్పోర్ట్ కోసమే మేం కట్టుకున్న ఫ్లై ఓవర్లు చూడండి.. దానికి మీవోడి పేరే పెట్టాం కదా.. హ్యాపీ కాదా? హ్యాపీ అంటే మీకు అర్థం కాదు.. అది మా తెలుగు .. మీ భాషలో చెప్పాలా? సంతోషమే కదా? ఇవన్నీ మేం తీసుకుపోతే మీకు మిగిలేది రాళ్లూ రప్పలే… మీ బతుకులను అలా రాళ్లూ రప్పల మధ్య ఎలా వదిలేస్తామనుకుంటున్నారు? అందుకే అది మీకు అప్పజెప్పేదేం లేదు.. మాకంటూ ఉన్న వ్యాపారాలు, బినామీ భూములను వదిలేసి మేమెందుకు వెళ్తాం. అభివృద్ధో అభివృద్ధి అని మీరు నెత్తీ నోరూ బాదుకుంటుంటే ఇదిగో ఈ రాజధానిని చూసుకుని సంతృప్తి చెందండి. అదే అభివృద్ధి అని స్పష్టంగానే చెప్తున్నాం కదా… మిగతా తొమ్మిది జిల్లాలు ఎడారులైతే మాకేం… అవేం మాకు అవసరం లేదు.. అంత గోల చేస్తే… సారీ మీ భాషలో లొల్లి పెడితే ఆ జిల్లాలన్నింటితో కలిపి మీరో రాష్ట్రమనే దుకాణం పెట్టుకొండి…రాజధాని జోలికి వచ్చారా ఖబడ్దార్‌.. రెక్కలు విరిచేస్తాం… ఈ రాజధానిని… మేము వదిలిపెట్టేది లేదు..

మీ ఊళ్లన్నింటినీ తొక్కుకుంటూ, పాదాక్రాంతం చేసుకుంటూ సదరు రాజధానిని మా చెప్పుచేతల్లో ఉంచుకోవటం ఖాయం. మీ ప్రాంతం నుంచి ఇక ఒక్కరూపాయి రాదని నిర్ధారించుకునేంత వరకూ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇది మేమొక్కరమే చేయటం లేదు.. ప్రపంచం అంతటా ఇదే ధర్మం నడుస్తోంది. గల్ఫులో చమురు కోసం ఇరాక్‌ను అమెరికా నాశనం చేయలేదా? అరబ్‌ ప్రపంచం మధ్య ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్‌ను పుట్టించలేదా? కాశ్మీర్‌ను కొల్లగొట్టేందుకు పాకిస్తాన్‌ టెరర్రిజాన్ని ప్రోత్సహించలేదా? క్యూబా, ఆఫ్గనిస్తాన్‌, ఆఫ్రికా ఇవన్నీ బలవంతుల కింద నలిగి పోయినవే కదా… బలవంతులు తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించినవే కదా…

ఈ ప్రపంచంలో బలవంతుడిదే రాజ్యం.. రాజ్యం వీరభోజ్యం అన్న మాట వినలేదా? మీరేం వింటారు.. మీకేం చదువుసంధ్యలు వచ్చు గనుకనా? బలం ఎవడికి ఉంటే వాడిదే రాజ్యం.. ఇప్పుడు మాదే ఆంధ్రప్రదేశం… బాధితులకు అడిగే హక్కు ఎంతమాత్రం లేదు.. ప్రత్యేక ఉద్యమాలట.. ఉద్యమాలు.. నోరుమూసుకుని పడి ఉండండి.. మేం చెప్పినట్లు నడుచుకోండి..అంతా సమైక్యంగా ఉందాం.. కలిసి ఉంటేనే కలదు సుఖం.. విడిపోవాలని ఆలోచించకండి..మీరు కూడా అదే ఆలోచిస్తున్నారన్న సంగతి మీకే తెలియటం లేదు..మీరూ సమైక్యంగానే ఉంటున్నారని కోరుకుంటున్నారని మేం చెప్తున్నాం తెలుసుకోండి..నేర్చుకోండి.. వినమ్రంగా ఉండండి.. మా ఏలికలో సుఖశాంతులతో గడపండి..

జై సమైక్యాంధ్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *